TELANGANA CONGRESS: కాంగ్రెస్‌లో ఆ నలుగురికి టిక్కెట్లు ఖాయమా..?

ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. కానీ, కొన్ని స్థానాల విషయలో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - February 23, 2024 / 08:26 PM IST

TELANGANA CONGRESS: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకుగాను 12 నుంచి 14 సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. కానీ, కొన్ని స్థానాల విషయలో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

MLC KAVITHA: 26న కవిత అరెస్ట్ తప్పదా..? సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

ఇటీవలే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మరో నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన సిట్టింగ్ ఎంపీ కావడం కలిసొచ్చే విషయం. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల టిక్కెట్ ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని సన్నిహితుల మాట. అలాగే.. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సికింద్రాబాద్ టికెట్ ఖాయమైందన్నది మరో ప్రచారం. ఇక ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది.

మరికొందరికి కూడా టిక్కెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్, సురేష్ కుమార్ షెట్కర్‌కు జహీరాబాద్ ఎంపి టికెట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజమాబాద్ టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వీటిలో చివరి నిమిషంలో మార్పులు జరిగినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. మిగిలిన స్థానాలకు కూడా సర్వేల ఆధారంగా, విజయం సాధించే అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థులపై త్వరలోనే స్పష్టత రానుంది.