Mudragada Padmanabham: కాపు ఉద్యమ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం త్వరలోనే వైఎస్సార్సీపీ జెండా కప్పుకోబోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది. కొంతకాలంగా ముద్రగడ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు తన రాజకీయ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ తన వైసీపీ చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముద్రగడ ఆసక్తి చూపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, ఆయనను పార్టీలో చేర్చుకుంటే ఉపయోగం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ముద్రగడను చేర్చుకోవడం వల్ల అదే సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లను కొల్లగొట్టడంతోపాటు, పవన్ కళ్యాణ్‌కు పడే ఓట్లలో చీలిక తేవచ్చని వైసీపీ అభిప్రాయం. పవన్‌పై మాటల దాడి చేసేందుకు కూడా ముద్రగడను ఉపయోగించుకోవచ్చు. కాపుల ప్రతినిధిగా ముద్రగడను చూపించే అవకాశం ఉంది. దీనిద్వారా రాజకీయంగా ఎంతో లబ్ధి కలిగే అవకాశం ఉన్నందున వైసీపీ ముద్రగడను పార్టీలో చేర్చుకోబోతుంది. త్వరలోనే ముద్రగడ వైసీపీలో అధికారికంగా చేరుతారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో తునిలో ముద్రగడ నిర్వహించతలపెట్టిన సభ హింసాత్మకంగా మారింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ సందర్భంగా ముద్రగడపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఆయనపై నమోదైన కేసుల్ని ఎత్తివేయించారు. దీంతో ముద్రగడ కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేశారు. అప్పుడే ముద్రగడ వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారని అందరికీ అర్థమైంది. వైసీపీ ప్రోద్బలంతోనే పవన్‌పై ముద్రగడ రెచ్చిపోతున్నారని ప్రచారం జరిగింది. కాపు ఉద్యమ నాయకుడిగా చెప్పుకొంటూ, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో ముద్రగడపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటిదాకా తెరవెనుక వైసీపీతో కలిసి నడిచిన ముద్రగడ.. ఇక అధికారికంగా.. అధికార పార్టీ సభ్యుడు కానున్నారు. పార్టీలో చేరిన తర్వాత పవన్‌నే టార్గెట్ చేస్తాడనడంలో సందేహం లేదు.