తెలంగాణలో (Telangana) హైదరాబాద్ ఎంపీ సీటులో కొన్న దశాబ్దాల పాటు MIM హవా కొనసాగుతోంది. ఓవైసీ కుటుంబానికి (Owaisi Family) చెందిన వారే ఈ స్థానం నుంచి గెలుస్తున్నారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియా ఉండటం… ముస్లింల ఓట్లే కీలకం కావడంతో ఓవైసీ కుటుంబానికి ఇక్కడ తిరుగులేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలుస్తున్నారు. అయితే ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును ఓ ముస్లిం మహిళకు ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయింది. ట్రిపుల్ తలాఖ్ రద్దు తర్వాత ఆ వర్గానికి చెందిన మహిళల్లో బీజేపీకి వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోడానికి కమలనాధులు ప్లాన్ వేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోనూ ముస్లిం మహిళలు బీజేపీకే ఓట్లేసినట్టు చెబుతున్నారు.
హైదరాబాద్ లోక్ సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఓటమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ డిసైడ్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీలోని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు తర్వాత ముస్లిం మహిళల్లో బీజేపీకి ఉన్న సానుభూతిని హైదరాబాద్ లో కూడా క్యాష్ చేసుకోవాలని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ఓవైసీని ఢీకొట్టాలంటే ముస్లిం మహిళా అభ్యర్థే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. కానీ బీజేపీలో చాలా తక్కువ మంది మహిళ ముస్లిం లీడర్లు ఉన్నారు. ఏబీవీపీ లీడర్ సయ్యద్ షాహెజాదీ మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు. ఉస్మానియాలో పీజీ చదివిన ఆమె కుటుంబం ఆదిలాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయింది. షాహెజాదీ గతంలో చంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ పై పోటీచేసి ఓడిపోయింది. అందుకే హైదరాబాద్ ఎంపీ సీటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని చూస్తోంది బీజేపీ. అది కూడా రామ మందిరం ఉద్యమానికి అనుకూలంగా… హిందూత్వ అనుకూల భావాలు కలిగి, ఫైర్ బ్రాండ్ అయిన మహిళ కోసం వెతుకుతోంది. అలాంటి మహిళ అయితే ఓవైసీని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఓల్డ్ సిటీకి చెందిన పార్టీ లీడర్ల వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ ఎంపీ సీటుపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది.
తెలంగాణలో 10 లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు సీటు ఆశిస్తున్నారో… ఆశవాహుల జాబితాను కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందించినట్టు సమాచారం. దీనిపై తొందర్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే ఈసారి హైదరాబాద్ సీటును కూడా వదిలిపెట్టేది లేదంటున్నారు కిషన్ రెడ్డి. మరి ముస్లిం మహిళ, హిందూత్వ భావాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి బీజేపీకి ఎలా దొరుకుతుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఇప్పటి వరకూ ఓవైసీపై పోటీకి దిగుతున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు భగవంత్ రావును ఎలా బుజ్జగిస్తారన్నది కూడా చూడాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సీటులో పోటీ చేసి 2లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు.