Maharashtra: కాంగ్రెస్ గెలుపుతో ఎంవీఏ కూటమిలో చిగురించిన ఆశలు.. మహారాష్ట్రలో బీజేపీకి చెక్!

ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న మహా వికాస్ అఘాడి (ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి-ఎంవీఏ) తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి.. కాంగ్రెస్ గెలుపు.. ఈ కూటమికి నైతిక బలాన్నిచ్చినట్లు కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 06:09 PM IST

Maharashtra: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయబోతుంది. అక్కడ బీజేపీ ఓటమి మహారాష్ట్ర రాజకీయాల్ని మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న మహా వికాస్ అఘాడి (ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి-ఎంవీఏ) తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి.. కాంగ్రెస్ గెలుపు.. ఈ కూటమికి నైతిక బలాన్నిచ్చినట్లు కనిపిస్తోంది.

గత ఏడాది వరకు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సీఎంగా ఉన్నారు. ఎంవీఏ కూటమి తరఫున ఆయన సీఎంగా పాలన సాగించారు. అయితే, ఉద్ధవ్‌కు చెందిన శివసేన నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశాడు. పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో అధికారం చేపట్టాడు. దీంతో ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయింది. ఉద్ధవ్ సీఎంగా రాజీనామా చేశారు. తర్వాత షిండే సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నెమ్మదిగా అధికార బీజేపీ-షిండే కూటమివైపు మళ్లారు. ఈ నేపథ్యంలో కూటమి మరింత బలహీనపడింది. ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్.. ఏమీ చేయలేని స్థితిలో ఉండి పోయాయి. బీజేపీ వ్యూహాల ముందు తేలిపోయాయి. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలు ఈ కూటమిలో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి.

కలిసికట్టుగా కష్టపడితే బీజేపీని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదనే నమ్మకాన్ని కలిగించాయి. కర్ణాటక ఫలితాల ద్వారా కాంగ్రెస్ ఇమేజ్ పెరగడం కూడా ఈ కూటమికి కలిసొస్తుంది. అందుకే ఈ దిశగా ఎంవీఏ తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కూటమి బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వంపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు ఎంవీఏ కీలక నేతలు ఆదివారం సమావేశం అవుతున్నారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో సమావేశం జరుగుతుంది. వచ్చే ఏడాది పార్లమెంటుకు, అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల అజెండాపై చర్చిస్తారు. ఈ సమావేశానికి ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్, అజిత్ పవార్, జయంత్ పాటిల్ వంటి నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఏ కూటమి నేతలు మాట్లాడుతూ.. మోదీ హవా ముగిసిందని, త్వరలో తమ వేవ్ ప్రారంభమవుతుందన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి మోదీ, అమిత్ షా ఓటమిగా అభివర్ణించారు. బీజేపీ కూటమికి చెక్ పెట్టే దిశగా తమ అడుగులు సాగుతాయన్నారు. ఇకపై తమ ఎన్నికల ప్రణాళిక ప్రారంభిస్తామన్నారు.