N.T.Rama Rao: తెలుగు నేలపై చెరిగిపోని చరిత ఎన్టీఆర్.. శతజయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు!

తెలుగు జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు ఎన్టీఆర్. సినిమా నటుడిగా, ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు సాధించిన విజయాలు, అందించిన సేవల్ని తెలుగు ప్రజలెవరూ మర్చిపోలేరు. ఆ మహానుభావుడు జన్మించి ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి. అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలను టీడీపీతోపాటు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 27, 2023 / 08:15 PM IST

N.T.Rama Rao: తెలుగు జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు ఎన్టీఆర్. సినిమా నటుడిగా, ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు సాధించిన విజయాలు, అందించిన సేవల్ని తెలుగు ప్రజలెవరూ మర్చిపోలేరు. తరాలతో సంబంధం లేకుండా ఆయన పేరు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. ఆ మహానుభావుడు జన్మించి ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి. అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలను టీడీపీతోపాటు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువారికి ఎన్టీఆర్ అంటే ఎందుకంత ఇష్టం? ఆయన ప్రత్యేకత ఏంటి? రాజకీయాల్లో ఆయన సంచలనాలేంటి? వంటి ఆసక్తికర విశేషాలివి.
వెండితెర ఇలవేల్పు.. తెలుగు వారి ఆరాధ్య దైవం.. ఆత్మగౌరవానికి ప్రతీక.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ.. ఇలా ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తెలుగు తెరపై రాముడు ఆయనే.. కృష్ణుడూ ఆయనే.. చివరకు రావణాసురుడూ ఆయనే. సాంఘిక చిత్రమైనా.. జానపదమైనా.. పౌరాణికమైనా.. సందేశాత్మకమైనా.. ఏ తరహా చిత్రంలోనైనా.. ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోగల నటుడు ఎన్టీఆర్. ఇవి ఆయన సినీ ప్రస్థానానికి నిదర్శనాలు. ఇక రాజకీయాల్లో ఆయన ఆగమనం ఒక సంచలనం. ఆయన ప్రయాణం ఆచరణీయం. మార్గం అనుసరణీయం. సినిమా అయినా.. రాజకీయమైనా.. తెలుగు జాతికి మాత్రం ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోగలిగే ఖ్యాతి ఆయనది. 1923 మే 28న ప్రస్తుత ఏపీలోని నిమ్మకూరులో, సాధారణ కుటుంబంలో జన్మించారు. యుక్త వయసు వచ్చాక సినిమాల మీద ఆసక్తితో ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతకాలానికే వెండితెరపై కాలుమోపారు. ఆ తర్వాత అదే వెండి తెరని ఏలారు. రాజకీయాల్ని శాసించారు.

సినీ ప్రస్థానం
1949లో వచ్చిన మనదేశం చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఏడాది పల్లెటూరి పిల్ల అనే మరో చిత్రం విడుదలైంది. తర్వాత 1951లో వచ్చిన పాతాళభైరవి ఒక సంచలనం. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు వంటి విజయవంతమైన చిత్రాలతో ఎన్టీఆర్ ఇక వెనుదిరిగి చూసింది లేదు. మాయాబజార్, భూకైలాస్, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం వంటి అనేక సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. తర్వాత వచ్చిన లవకుశ ఒక సంచలనం. దీనితోపాటు శ్రమద్విరాటపర్వం, సీతారామకళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి చిత్రాలతో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణికి పాత్రలు చేసి మెప్పించారు. అప్పట్లో ఆ చిత్రాలు చూసిన ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను ఒక నటుడిలా కాకుండా సాక్షాత్తు దేవుడిలా చూసేవాళ్లు.

ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు ప్రజల్లో అంతగా ప్రభావం చూపేవి. ఎన్టీఆర్ అంటే రాముడు.. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు అన్నట్లుగా ఉండేది. ఈ పాత్రల ద్వారా తెలుగువారి అభిమాన నటుడు కాస్తా.. ఆరాధ్య దైవంగా మారారు. మిగతా నటులు ఇలాంటి పాత్రలు పోషించినా, ఎన్టీఆర్ స్థాయిని అందుకోలేకపోయారు. పౌరాణికి చిత్రాలతోనే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలతోనూ శిఖరస్థాయిని అందుకున్నారు. తెలుగు సినిమాకు ముఖచిత్రంగా మారిపోయారు. ఆయన తర్వాతే ఎవరైనా అనేలా ఎన్టీఆర్ ఖ్యాతి తెలుగునాట వ్యాపించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన 44 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. తన సినిమాలతో ప్రతి ఇంటికీ చేరువయ్యారు.


రాజకీయాల్లో సంచలనం
సినిమాల్లో తిరుగులేకుండా సాగుతున్న ఎన్టీఆర్ జీవితం 1982లో కీలక మలుపు తిరిగింది. తనను ఇంతకాలం ఆదరించిన తెలుగువారికి సేవ చేయాలన్న సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పైగా అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఏపీకి సంబంధించి ఎప్పుడు పడితే అప్పుడు ముఖ్యమంత్రిని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం మారుస్తుండేది. ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానమే. దీంతో తెలుగువారిని ఎవరు పాలించాలో ఢిల్లీ నిర్ణయించడం ఏంటని ఎన్టీఆర్ ప్రశ్నించారు. ఇది తెలుగువారిని అవమానించడమే అని గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి, 29న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా యాత్ర చేపట్టారు.

35,000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇదో రికార్డు అని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు. 1983 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఘోర ఓటమి పాలయ్యేలా చేశారు. అయితే, 1984 ఆగష్టులో అప్పటి కాంగ్రెస్ కుట్ర నేపథ్యంలో ఎన్టీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి మిత్రపక్షాల సాయంతో సెప్టెంబర్ 16న తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు. 1985లో మరోసారి ఎన్నికలకు వెళ్లి 202 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకున్నాడు. 1989 వరకు ఆయన పాలన కొనసాగింది. అదే ఏడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారం దక్కించుకుంది. ఎన్టీఆర్ మూడోసారి సీఎం అయ్యారు.
పేదల కోసం పథకాలు
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆయన సినిమా నటుడిగానో లేక రాజకీయంగా ఆయన సాధించిన విజయాలో కాదు. రాజకీయాల్లో, పాలనలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, సినిమా పరిశ్రమలో స్లాబ్ సిస్టమ్ అమలు చేయడం, శాసన మండలి రద్దు, భూ సంస్కరణలు వంటివి అమలు చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కల్పించారు. రాజకీయ ప్రాధాన్యం లేని సామాజికవర్గాలకు పెద్దపీట వేశారు.

పేద వారి అభ్యున్నతికి కృషి చేశారు. ఇలాంటి పనుల వల్ల ప్రతి తెలుగువారు ఎన్టీఆర్‌ను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నాయంటే.. ఇతర అణగారిన వర్గాలను గుర్తిస్తున్నాయంటే అది ఆయన మొదలుపెట్టిన పనే. రాజకీయాల్లో ఆ తర్వాత ఎవరు.. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, పథకాలు ప్రవేశపెట్టినా ఎన్టీఆర్‌తో పోలుస్తున్నారంటే ఆ తరానికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ప్రజలకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఖ్యాతి తగ్గలేదు. ఆయన ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.