సురేఖపై కోర్ట్ కి నాగ చైతన్య, ఏం జరగబోతుంది…?

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేటిఆర్ కారణంగా సమంతా నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని హీరోయిన్ లు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లిపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - October 3, 2024 / 09:40 AM IST

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేటిఆర్ కారణంగా సమంతా నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని హీరోయిన్ లు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లిపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా కథానాయికల జీవితాలతో ఆడుకున్నారు అంటూ ఆమె దుమ్మెత్తి పోశారు. కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారు అనుకుంటున్నారు అని మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్ కు చెప్పినట్లు ఉన్నారు అంటూ మండిపడ్డారు.

ఎస్టీ మహిళా సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న సురేఖ బీసీ మహిళనైన తన పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఐదేళ్లు భారాసలో పని చేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసన్నారు ఆమె. కేటీఆర్ కు కూడా తల్లి అక్క, చెల్లెలు లేరా అని నిలదీశారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్లపై ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఘాటుగా స్పందించారు. సినిమా వాళ్ళ జీవితాలు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. ఇక సీతక్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. పరువు నష్టం దావా వేస్తామని ఇప్పటికే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అటు సినీ నటుడు నాగ చైతన్య కూడా పరువు నష్టం దావా వేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనితో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే అక్కినేని కుటుంబం ఈ విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిన సమయంలో కూడా పెద్దగా పోరాటం చేసే ప్రయత్నం నాగార్జున చేయలేదు. కాబట్టి ఇప్పుడు కోర్ట్ కి వెళ్తారా పరువు నష్టం దావా వేస్తారా అంటే చెప్పలేం. నాగార్జున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయ నాయకులతో సఖ్యత కోసమే ప్రయత్నమే చేస్తారు. ఇందులో నిజా నిజాలు పక్కన పెడితే కోర్ట్ కి వెళ్తే ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందో అనే ఆందోళన కూడా ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు.