అప్రూవర్ గా నందిగం సురేష్, అందుకే జగన్ వెళ్ళారా…?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో... తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 14, 2024 / 11:37 AM IST

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో… తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కోర్ట్ రెండు రోజుల పాటు సురేష్‌ను విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు విచారించనున్నారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా నందిగం సురేష్ ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సురేష్‌ను విచారించేందుకు అనుమతించారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ నేత మాదిగాని గురునాథం సంచలన వ్యాఖ్యలు చేసారు. నందిగం సురేష్ ను జగన్ పరామర్శించడంపై స్పందించిన ఆయన… గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ను ప్రేమతో జగన్ పరామర్శించలేదు అని… భయంతో ఆయన వద్దకు వెళ్ళారని అన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని బెదిరించటానికి వెళ్లాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

తన స్వార్థ రాజకీయం కోసం తనని వాడుకున్నాడని తెలుసుకున్న నందిగామ సురేష్ అప్రూవర్‌ గా మారే అవకాశం ఉందని గురునాథం బాంబు పేల్చారు. జగన్‌కి తన దూతల ద్వారా సందేశం పంపిస్తే.. ఆగమేఘాల మీద జగన్ పరుగెత్తుకుంటూ వచ్చాడని, నందిగం సురేష్ మరో దస్తగిరి అవుతాడనే భయంతోనే జగన్ జైలుకు పరుగులు గురునాథం వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి నాశనానికి పథక రచయిత తానే అనే పేరు ఎక్కడ బయటపెడతాడో అనే భయం జగన్‌లో మొదలైందని ఆరోపించారు.

నందిగం సురేష్ నిజాలు బయటపెడితే చంపివేస్తాడనే భయం ఆయన కుటుంబ సభ్యుల్లో ఉందన్నారు. ఇక ఈ కేసులో నందిగం సురేష్ బెయిల్ కోసం ప్రయత్నం చేసినా వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న లేళ్ళ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను కూడా విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.