Nara Bhuvaneshwari: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఏపీ సర్కారు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అదొక్కటే కాదు.. ఇతరత్రా కేసులను కూడా వారిద్దరిపై ఏపీ సీఐడీ పెట్టింది. ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా.. నారా లోకేశ్‌ను కూడా విచారించేందుకు సీఐడీ రెడీ అవుతోంది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకుంటే కోర్టు అనుమతితో అరెస్టు చేస్తామని ఇవాళ (శుక్రవారం) ఉదయం హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది.
దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోననే ఆందోళన టీడీపీ శ్రేణులలో నెలకొంది. ఈ తరుణంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘మేలుకో తెలుగోడా’ పేరుతో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌పై పెట్టిన కేసుల అంశాన్ని.. ఆ కేసులతో ముడిపడిన వాస్తవాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ముఖ్య లక్ష్యమని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి అనుకూలంగా రాష్ట్రంలో ఏర్పడిన సానుభూతి పవనాలను అందిపుచ్చుకునేందుకు భువనమ్మ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బస్సు యాత్ర చేయనున్న నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఇప్పటికే భువనేశ్వరి భేటీ అయినట్లు తెలుస్తోంది.
టీడీపీలో యాక్టివ్‌గా మారిన భువనేశ్వరి
వాస్తవానికి నారా భువనేశ్వరి చాలా యాక్టివ్‌గా టీడీపీలో ముందుకు సాగుతున్నారు. పార్టీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యకలాపాలతో ముడిపడిన సమాచారాన్ని సోషల్ మీడియాకు విడుదల చేస్తున్నారు. తన బాధ, ఆవేదనను వెళ్లగక్కుతూ వీడియో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. అయితే భువనమ్మ బస్సు యాత్రపై ఇంకొన్ని రోజుల్లోనే క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును నారా భువనేశ్వరి ఎప్పటికప్పుడు కలుస్తున్నారు. చంద్రబాబు గైడెన్స్ మేరకే ఆమె బస్సు యాత్రకు రెడీ అవుతున్నారని అంటున్నారు. భువనేశ్వరి రాజకీయంగా రంగంలోకి దిగితే వైఎస్సార్‌సీపీ విమర్శలు పెరుగుతాయని, ఆ మాటలను తట్టుకుని భువనేశ్వరి ముందుకు సాగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఆనాడు వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ విజయమ్మ బస్సు యాత్ర చేశారు. ఎంతో జనాదరణ వచ్చింది. చివరకు జగన్ సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు భర్త, కొడుకు కోసం భువనమ్మ చేయబోతున్న బస్సు యాత్ర కూడా అలాంటి ఫలితాలనే సాధిస్తుందనే ఆశాభావంతో టీడీపీ క్యాడర్ ఉంది.
జైలులో భువనేశ్వరి భావోద్వేగం..
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును శుక్రవారం ఉదయం ములాఖత్‌లో భాగంగా భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, మాజీమంత్రి పొంగూరు నారాయణ కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. గత 21 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉండటాన్ని తలచుకుని భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన మరుసటి రోజు నుంచి రాజమండ్రిలోనే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఉంటున్నారు. లోకేశ్ క్యాంప్ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఇంటి దగ్గర నుంచి భోజనానికి చంద్రబాబు నాయుడుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నారా భువనేశ్వరి ఇంటి దగ్గర నుంచే భోజనం పంపిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలకు నారా భువనేశ్వరి వెళ్లి వారితో మమేకమవుతున్నారు.