NARA BHUVANESWARI: రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. మంగళవారం సాయంత్రం వేళ చంద్రబాబు సతీమణి భువనేశ‌్వరి, తనయుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి జైలులో చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. “చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, జైలులో సరైన వసతులు లేవు. చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి వస్తోందని బాధ పడుతున్నారు. ఆయన భద్రత గురించే మేం ఆందోళన చెందుతున్నాం.
పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏపీ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడే వారు. రాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని ధారపోశారు. దేశంలో ఏపీ నెంబర్1గా ఉండాలని కోరుకునేవారు. ఎప్పుడైనా కుటుంబం గురించి మాట్లాడాలన్నా.. తనకు ప్రజలే ముఖ్యమని చెప్పేవారు. అలాంటి వ్యక్తిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను. టీడీపీని ఎన్టీఆర్ నిర్మించారు. ఈ పార్టీ ఎక్కడికీ వెళ్లదు. మా కుటుంబం ప్రజల కోసం, కార్యకర్తల కోసం పోరాడుతుంది. మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని తీసుకెళ్లి, జైలులో పెట్టడంపై అందరూ ఆలోచించాలి. ప్రజలంతా బయటికొచ్చి మీ హక్కు కోసం పోరాడాలి. ఆయనకు సహకరించాలి. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానని ఆయన అన్నారు.
చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయనను తీసుకెళ్లి, జైలులో పెట్టారు. ఆయన్ను వదిలేసి వస్తుంటే నా మనసు చలించింది. నాలో సగభాగాన్ని అక్కడ వదిలేసి వస్తున్నట్లుగా ఉంది. ఆయన కోసం నా ఆత్మను వదిలేసి వచ్చా” అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబుతో జైలులో కుటుంబ సభ్యులు దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు.