NARA BHUVANESWARI: చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నిజం గెలవాలి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు కారణంగా మరణించిన టీడీపీ అభిమానులను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. దీంతో టీడీపీలో జోష్ నింపేందుకు నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లి, చంద్రబాబు అరెస్టు అక్రమం అని వివరించబోతున్నారు. ప్రజల్లో సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. భువనేశ్వరి రాజకీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారి. పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో, భువనేశ్వరి జనాల్లోకి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. అయితే, భువనేశ్వరి యాత్రపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ నేత కొడాలి నాని మాట్లాడుతూ ‘‘నారా భువనేశ్వరి నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో జైలు నుంచి బయటకు రారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన బాబు ప్రస్థానం నేడు రూ.2 వేల కోట్లు దాటింది. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు ఏ విధంగా రూ.35 కోట్లు చెల్లించారు? భువనేశ్వరి యాత్ర కోసం 7కోట్ల రుపాయలతో బాంబే నుంచి బస్సు తయారు చేయించారు.
కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే రూ.7 కోట్లతో తయారైన బస్సులో యాత్ర చేస్తున్నారా? వెయ్యి గొడ్లను తిన్న రాబందు గాలివానకు కొట్టుకు పోయింది. అవినీతి సొమ్ముతో హెరిటేజ్‌ను స్థాపించి భువనేశ్వరికి అప్పగించారు. నిజం గెలుస్తుందని టీడీపీ అంటోంది. నిజం గెలవడం వల్లే చంద్రబాబు జైల్లో ఊచలు లెక్క బెడుతున్నారు. లోకేష్ అసమర్ధుడు కావడంతోనే లోకేష్ తల్లి, యాత్రపేరుతో తిరగడానికి రోడ్లపైకి వచ్చారు” అని విమర్శించారు.