NARA BRAHMANI: టీడీపీ భారం మోస్తున్న బ్రాహ్మణి.. సీఎం అంటూ మొదలైన ప్రచారం..!!

త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తోంది. లోకేష్ కూడా అరెస్ట్ అయితే.. టీడీపీని ముందుకు నడిపించేది ఎవరు అనే విషయంలో నైరాశ్యం నెలకొంది. టీడీపీని కాపాడటం బాలకృష్ణ వల్ల కాదని ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 05:53 PM IST

NARA BRAHMANI: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాల్లో మంటలు రేగుతున్నాయ్. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఏపీలో టీడీపీ వర్గాలు మండిపోతున్నాయ్. చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ.. నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ, మీడియా ముఖంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలోనే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరులో కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు లోకేష్, బాలకృష్ణ అండగా నిలబడుతూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో మరో వార్త బయటకు వచ్చింది. త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తోంది. లోకేష్ కూడా అరెస్ట్ అయితే.. టీడీపీని ముందుకు నడిపించేది ఎవరు అనే విషయంలో నైరాశ్యం నెలకొంది. టీడీపీని కాపాడటం బాలకృష్ణ వల్ల కాదని ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగారు నారా బ్రాహ్మణి. రాజకీయ కుటుంబానికి చెందిన బ్రాహ్మణి.. ఇన్ని రోజులు బిజినెస్‌లు, కుటుంబ వ్యవహారాలు తప్ప రాజకీయాల్లో అసలు కనిపించలేదు. ఈ మధ్యే మీడియా ముందుకు వచ్చి అద్భుతంగా మాట్లాడింది. టీడీపీ నేతలు, కార్యకర్తలంతా తమ కుటుంబం అంటూ సెంటిమెంట్‌ టచ్ ఇచ్చింది. నారా బ్రాహ్మణి మాట తీరుకు ఫిదా అయిన నేతలు.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌టాపిక్ అయ్యాయ్.

చంద్రబాబు తర్వాత లోకేశ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. అదే జరిగితే.. టీడీపీ పగ్గాలు అందుకునే శక్తి బ్రాహ్మణికి ఉందని.. టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయ్. బ్రాహ్మణి కేవలం కుటుంబం, బిజినెస్ కాకుండా.. తన తాత నందమూరి తారక రామారావు, మామ చంద్రబాబులాగా సమయానికి తగ్గట్టు వ్యవహరించే సమయస్ఫూర్తి, రాజకీయ చతురత ఆమెలో ఉన్నాయని.. టీడీపీని ఆమె ముందుకు తీసుకెళ్లే శక్తి ఉందని భావిస్తున్నారు. అంతే కాదు.. సీఎం పోస్టుకు కూడా ఆమె ఏం తక్కువ కాదని అంటున్నారు!!