Nara Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు కోర్టు ‘నో’.. 19 దాకా జైల్లోనే..!

బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ తరఫు లాయర్ గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈనెల 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించారు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 01:29 PM IST

Nara Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టైన నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈరోజు బెయిల్‌ఫై తీర్పు వస్తుందని టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ.. అలా జరగలేదు. బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ తరఫు లాయర్ గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈనెల 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించారు.

సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్‌లోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని జడ్జి కామెంట్ చేశారు. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌నూ ఈ నెల 19నే విచారిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు తరఫున ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో.. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో చంద్రబాబు పేరు లేదన్నారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులోకి చంద్రబాబును లాగారని.. ప్రధాన బెయిల్ పిటిషన్ తేలేలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. అయినా ఫలితం దక్కలేదు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసును నమోదు చేసిన 22 నెలల తర్వాత చంద్రబాబుపై సీఐడీ కేసు బనాయించిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం, దర్యాప్తు, అరెస్ట్ చేయటం చట్ట విరుద్ధం అంటూ ఆయన తరఫు లాయర్లు తెలిపారు. బెయిల్ ఇవ్వటానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని.. తప్పుడు కేసు అయినా.. దర్యాప్తునకు సహకరించటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, చంద్రబాబును శుక్రవారం (నేడు) కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోగా జైలు అధికారులు తిరస్కరించారు.