NARA LOKESH: టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా ? చంద్రబాబు, లోకేశ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ?

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 08:22 AM IST

నేను చేయగలను.. నేను మాత్రమే చేయగలను అనే మాటలు ఒకేలా వినిపించినా.. అర్థాలు వేరు. ఒకటి నమ్మకం అయితే.. మరొకటి అతి నమ్మకం. ఏపీలో టీడీపీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది ! మంచిరోజులు వచ్చాయని టీడీపీ మురిసిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇదేం కర్మ కార్యక్రమానికి, లోకేశ్ పాదయాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ రాజకీయంగా టీడీపీకే అనుకూలంగా మారుతున్నాయి. పైగా వైసీపీలో ఉన్న వర్గపోరు, అసమ్మతి మరింతలా కలిసి వస్తున్నాయని చెప్పాలి. నెల్లూర్ లో జరిగిన రాజకీయ పరిణామాలే దీనికి ఉదాహరణ.

ఇక పార్టీ విషయానికొస్తే టీడీపీ వెనుకబడిన ఉన్న స్థానాల్లో నెల్లూరు జిల్లా మెదటిది. తాజాగా జరిగిన పరిణామాలన్నీ కలిసి రావడంతో.. తమకు మంచి వేవ్ మొదలైందని టీడీపీ అతినమ్మకంలోకి వెళ్లిపోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు సభలకు వస్తున్న జనం.. లోకేశ్ పాదయాత్ర ప్రభంజనం.. ఇవన్నీ చూసి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అని టీడీపీ అంచనాలు వేసుకుంటోంది. ఉందిలే లోకేశ్ కాలం ముందు ముందునా అంటూ ఎవరికి వారే చిన్నగా పాడుకుంటున్నారు. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు.. కష్టపడి వ్యూహలు రచించాల్సిన పని లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందని ఓట్లు వాటంతట అవే సైకిల్ ఎక్కి కూర్చుంటుందని పచ్చ పార్టీ నేతలతో పాటూ అధిష్టానం కూడా ఈఅంచనాల్లో మునిగితేలుతున్నారు. హైకమాండ్ లెక్కలన్నీ ఇలానే కనిపిస్తున్నాయన్న చర్చ కూడా మరోవైపు జరుగుతోంది.

ఇక లోకేశ్ విషయానికొస్తే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చాలామందికి చాలాసార్లు చెప్తుంది కూడా ఇదే. ఇలాంటి ఊహల్లోనే మునిగి తేలుతుంటే.. అది కచ్చితంగా కాటేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ నేతలంతా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇలాంటి లెక్కలు వేసే 2019లో సైకిల్ పార్టీ చతికిలపడింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. సభల్లో, సమావేశాల్లో, యాత్రలో జనం భారీగా కనిపించినంత మాత్రాన అవన్నీ ఓట్లుగా మారుతాయి అనుకోవడం సైకిల్ పెడల్ మీద రివర్స్‌లో కాలేసినట్లే. వేవ్ పనిచేస్తుందని చెప్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడం వరకు పర్లేదు.. అదే వేవ్ కచ్చితంగా గెలిపించి తీరుతుందని.. అనుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

వైసీపీ నుంచి వలసలు ఉన్నమాట నిజమే.. జనాల్లో ఆస్థాయి తీవ్ర వ్యతిరేకతకూడా ఉండాలి. ఇవన్నీ పార్టీలో జోష్ నింపడం వరకు మాత్రమే ఉపయోగపడతాయి. మెజారిటీ ఓటర్ల మనసు గెలుచుకోవాలంటే.. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకోవాలి. ఇద్దరు జంపింగ్ ఎమ్మెల్యేలు.. నలుగురు జనాలను చూసి గెలుపు మనదే అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకి వెళ్తే తమగోయి తాము తవ్వుకున్నట్లే అవుతుంది.

చివరగా వైసీపీలో ఎన్ని గుసగుసలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఫ్యాన్ పార్టీని ఢీకొట్టడం టీడీపీకి అంత ఈజీ కాదు. పైగా సంక్షేమమే మరోసారి అధికారం కట్టబెడుతుందన్న వైసీపీ అంచనాల్లో నిజం లేకపోలేదు. రాష్ట్రంలో ఓటర్లలో సగం మందికి ఏదో ఒకలా సంక్షేమం అందింది అని వైసీపీ లెక్క. ఆ ఓట్లు తమవే అనే నమ్మకమే ఫ్యాన్ పార్టీ దూకుడుకు కారణంగా కనిపిస్తోంది. అలాంటి ఓటర్ల మనసు తమవైపు తిప్పుకోవడం టీడీపీకి అంత ఈజీ కాదు. ఇప్పటికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ను పక్కనపెట్టి.. అసలు వ్యూహాలకు టీడీపీ పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే కచ్చితంగా ఎదురుదెబ్బ తినడం ఖాయం.