NARA LOKESH: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా చేర్చింది. ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో లోకేష్ తరఫు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఇవి శుక్రవారం మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్ట్ విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని, ఈ విషయంలో తగిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ అంటే విచారణకు పిలవడమే. అందువల్ల అరెస్టుకు అవకాశం లేకపోవడంతో, ముందస్తు బెయిల్ విచారణ ముగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. మిగిలిన రెండు కేసుల్లో కూడా అత్యవసరంగా విచారణ చేపట్టాలని లోకేష్ తరఫు న్యాయవాదులు కోరడంతో, కోర్టు దీనికి అంగీకరించింది. మరోవైపు ప్రస్తుతం ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై వివిధ పార్టీల జాతీయ స్థాయి నేతల్ని, న్యాయ నిపుణుల్ని లోకేష్ సంప్రదిస్తున్నారు. దీంతో ఆయనకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. నిజానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను సీఐడీ అరెస్టు చేస్తుందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే అరెస్టు చేస్తారనే ప్రచారం జరగగా.. ఆ అవకాశం లేదని తాజాగా తేలింది.