Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 03:25 PM IST

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్‌ను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తేలడంతో లోకేష్ అప్రమత్తమయ్యారు. తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్‌ను అరెస్టు అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ కేంద్ర పెద్దలు, న్యాయ నిపుణులతో చంద్రబాబు అరెస్టు గురించి చర్చిస్తున్నారు. లోకేష్ రెండు రోజుల్లో ఏపీకి తిరిగొచ్చే అవకాశం ఉంది. గురువారం రాజమండ్రికి వచ్చే అవకాశం ఉంది. అతడిని ఢిల్లీ నుంచి ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అరెస్టు చేయాలని సీఐడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏంటీ కుంభకోణం
అమరావతి రాజధాని పేరుతో అక్కడి అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) చేపట్టే ఉద్దేశంతో అప్పటి చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి పాల్పడిందని జగన్ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగి విచారిస్తోంది. నారా లోకేష్ సహా పలువురు వ్యక్తులు, సంస్థలను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. లోకేష్‌తోపాటు ఆయన భార్య బ్రాహ్మణి నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని సీఐడీ భావిస్తోంది. దీంతో నారా బ్రాహ్మణి, భువనేశ్వరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
మరోవైపు నారా లోకేష్ ఈ నెల 29, శుక్రవారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే, ఈలోపే లోకేష్‌ను అరెస్టు చేయాలని సీఐడీ భావిస్తోంది. దీనివల్ల టీడీపీకి సానుభూతి దక్కకూడదనేది వైసీపీ ప్లాన్ అని తెలుస్తోంది. లోకేష్ అరెస్టైతే.. పార్టీని నందమూరి బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి నడిపించే అవకాశం ఉంది.