Lokesh & Jr NTR: లోకేశ్‌ పిలిచారు సరే.. ఎన్టీఆర్ వస్తారా?

ఎన్టీఆర్ ఎంట్రీకి లోకేశ్‌ అడ్డుగా మారారని ప్రచారం కూడా జరిగింది. దీంతో లోకేశ్‌ లౌక్యంగా సమాధానం చెప్పారు. ఆయన రావాలి అనుకుంటే.. ఆపే వారు ఎవరూ లేరని.. చాయిస్‌ ఎన్టీఆర్‌కు వదిలేశారు.

  • Written By:
  • Updated On - February 25, 2023 / 03:47 PM IST

2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోకపోతే టీడీపీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. చంద్రబాబుకు, లోకేశ్‌కు కూడా బాగా తెలుసు ఇది ! అందుకే అధికారానికి దారి చూపించే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ఈ ఇద్దరు ! పాదయాత్రలు, పర్యటనలు, పరామర్శలు.. జనాలకు పలకరింపులు.. వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు.. లోకేశ్, చంద్రబాబు అన్నీ క్లియర్‌ చేస్తున్నారు. తిరుపతిలో హలో లోకేశ్‌ కార్యక్రమంలో లోకేశ్ చేసింది కూడా అదే ! పొత్తుల విషయంలో చంద్రబాబు ఆచీతూచీ అడుగులు వేస్తుంటే.. వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు లోకేశ్‌. పార్టీలోకి ఎన్టీఆర్‌ను లోకేశే రానివ్వడం లేదు అనే ప్రచారానిక ఎండ్‌ కార్డ్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో మార్పు కోరుకునే వారు ఎవరైనా సరే.. టీడీపీలో చేరవచ్చు అని.. బాల్‌ను ఎన్టీఆర్‌ కోర్టులోకి నెట్టారు. రావాలి అనుకుంటే.. ఆహ్వానించేందుకు ఎప్పుడూ సిద్ధమే అని.. ఎన్టీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవు అని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆరే ! ఐతే ప్రస్తుతం సినిమాల మీదే తారక్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఏపీ రాజకీయంలో తన పేరు కీలకంగా మారినా.. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పడం లేదు. వైసీపీ పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా.. ఆ మధ్య అమిత్‌ షాను కలిసినా.. రాజకీయాల మాట కూడా ఎత్తడం లేదు జూనియర్ ! ఐతే ఇప్పుడు లోకేశ్ ఆహ్వానించినా.. 2024 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. 2009ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆ తర్వాత నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. కొడాలి నాని పార్టీ మారినప్పుడు కూడా.. అది కొడాలి వ్యక్తిగత విషయం అని తప్పిచుకున్నారే తప్ప… రాజకీయంగా ఎలాంటి కామెంట్‌ చేయలేదు.

ఐతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఈ మధ్య మళ్లీ డిమాండ్ వినిపించడం మొదలైంది. చంద్రబాబును డైరెక్ట్‌గా తెలుగుతమ్ముళ్లు నిలదీసిన సందర్భం కూడా ఉంది. ఎన్టీఆర్ ఎంట్రీకి లోకేశ్‌ అడ్డుగా మారారని ప్రచారం కూడా జరిగింది. దీంతో లోకేశ్‌ లౌక్యంగా సమాధానం చెప్పారు. ఆయన రావాలి అనుకుంటే.. ఆపే వారు ఎవరూ లేరని.. చాయిస్‌ ఎన్టీఆర్‌కు వదిలేశారు. ఏమైనా నడక సంగతి ఎలా ఉన్నా.. రాజకీయం గుట్టు తెలిసింది లోకేశ్‌కు అనే చర్చ మొదలైంది.