NARA LOKESH: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై.. ఒక్కో పార్టీ నేత ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబుకు బెయిల్ తీసుకు రావడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన లోకేశ్.. కేంద్రం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ లోకేశ్ సమావేశం అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ప్రతిపక్షాల్ని అణిచి వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోకేష్ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో.. ద్రౌపది ముర్మును పార్టీ నేతలతోసహా కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై కక్షగట్టిన ఏపీ సర్కార్.. ఏ ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేశారని స్కిల్ కేసు వివరాలు అదించారు. లోకేశ్‌తో పాటు టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇక అంతకుముందు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను ఏ14గా చేర్చడంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు లోకేశ్. యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడని.. ఏం చేసినా సరే యువగళం ఆగదని హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లిన లోకేష్.. కేసు గురించి జాతీయ మీడియాలో తన వాదనలు వినిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో.. ఎంపీల ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి లోకేశ్ వాస్తవాలు చెబుతున్నారని.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.