NARA LOKESH: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి తమకు జగన్ గిఫ్ట్ ఇచ్చాడని, ఆరు నెలల్లో జగన్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతినబూనారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా 2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరిగిన అరాచకాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును జగన్ నొక్కుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెట్టినా కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులతో నాకేం సంబంధం. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావడం లేదు. రోజుకో వదంతి, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించాలని అనుమతులు కోరాం. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. వెంటనే నా పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చి గిఫ్ట్ ఇచ్చారు. జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. యువగళం పాదయాత్ర ప్రారంభానికి అన్ని అనుమతులకి దరఖాస్తు చేశాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే పాదయాత్ర మొదలవుతుంది” అని లోకేష్ అన్నారు.
తాను ఢిల్లీలో దాక్కున్నానని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, తనపై వైసీపీ పెట్టించిన తప్పుడు కేసులో సత్తా ఉంటే ఢిల్లీ వచ్చి అరెస్టు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతోనే ఇది తప్పుడు కేసు అని తేలిపోయిందన్నారు. “మా నాయకుడిని తప్పుడు కేసులో అరెస్టు చేసిన తరువాత న్యాయ పోరాటంలో భాగంగా ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో మాట్లాడుతున్నా. ఏపీలో వైకాపా అరాచక పాలనని జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లా. భవిష్యత్తు గ్యారెంటీ, యువగళం, వారాహి యాత్రలతో మేము ప్రజల్లోకి వెళ్లకూడదనే వైసీపీ వ్యూహంలో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు. న్యాయపోరాటం చేస్తున్నాం. ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచాం. స్కాంలు అని ఆరోపిస్తున్న వైకాపా సర్కారు దగ్గర కనీస ఆధారాలు లేవు. చంద్రబాబుని ఆధారాలు అడుక్కుంటున్నారు. వైకాపా కుట్రపూరితంగా బనాయిస్తున్న ఏ ఒక్క కేసులో ఒక్క పైసా నాకు, నా కుటుంబం, ఫ్రెండ్స్‌కి రాలేదు” అని లోకేష్ వ్యాఖ్యానించారు.
అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంఘీభావం ప్రకటిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారంతా ప్రశాంతంగా ఉన్నారని, శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్‌కు వెళ్తున్నప్పుడే ప్రభుత్వ-ప్రైవేటు ఆస్తులకి ఎటువంటి నష్టం కలగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపాలని మాకు ఆదేశాలు ఇచ్చారని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా తమ నాయకుడు నేర్పిన క్రమశిక్షణని ఫాలో అవుతూనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు.