Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ సహా టీడీపీ కీలక నేతలంతా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. చంద్రబాబు కేసులో విచారణపైనే ఫోకస్ చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా మద్దతు కూడగట్టే పనిలో నారా లోకేష్ ఉన్నారు. ఢిల్లీ వెళ్లి జాతీయ నేతల్ని కలిసేందుకు ప్రయత్నించగా మిశ్రమ స్పందన వచ్చింది. పెద్ద నేతలెవరూ లోకేష్‌కు సంఘీభావం తెలపకపోయినా.. వివిధ పార్టీల తరఫున కొందరు నేతలు మాత్రం స్పందించారు.
పార్టీకి జోష్ తెచ్చేలా
చంద్రబాబుకు కోర్టు మరో 11 రోజులు.. అంటే అక్టోబర్ 5 వరకు రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన జైలు నుంచి బయటకు రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాల్సిన బాధ్యత నారా లోకేష్‌పై ఉందని టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీలో జోష్ నింపాలంటే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేశ్ పాదయాత్ర ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర ఆగిపోయిన చోటు నుంచే తిరిగి యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యనేతలతో లోకేష్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరి సూచన మేరకు యువగళం పాదయాత్ర వచ్చే వారం నుంచే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలు, ప్రజల్లో వచ్చిన స్పందన వంటి అంశాలపై టీడీపీ నేతల సమావేశంలో చర్చించారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయగలిగిందని, అయితే, ఆయనపై అవినీతి ముద్ర మాత్రం వేయలేకపోయిందని, ప్రజల్లో సానుభూతి వ్యక్తమైందని నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసగా చేపడుతున్న కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులపై ఆగ్రహం
చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కేసు విషయంలో సీనియర్ లాయర్లతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే అంశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాలని కూడా టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు జైలు నుంచి వచ్చే వరకు పార్టీని నడిపించే బాధ్యతలను అటు లోకేష్, ఇటు నందమూరి బాలకృష్ణ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు నారా బ్రాహ్మణి సైతం రాజకీయ ప్రవేశం చేస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో లోకేష్‌ను కూడా అరెస్టు చేసే సూచనలున్న నేపథ్యంలో, బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం అంశం ఆసక్తి కలిగిస్తోంది.