Amith Sha: జగన్‌ అవినీతి అంతా ఉత్త ముచ్చటేనా.. నిజమే ఐతే చర్యలెందుకు లేవ్ అమిత్‌ షా జీ?

ఇదో హఠాత్‌ పరిణామం అనిపించింది.. ఏపీలో అమిత్ షా, బీజేపీ పెద్దల మాటలు చూస్తే ! వైజాగ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఢిల్లీ పెద్దలు అమిత్‌, జేపీ నడ్డా.. హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 07:26 PM IST

ఏపీకి ఏమిస్తాం.. ఏపీకి ఏం చేస్తామని చెప్తారు అనుకుంటే.. అందుకోవడమే జగన్ అవినీతి గురించి ఎత్తుకున్నారు బీజేపీ పెద్దలు ! నిన్న మొన్నటి వరకు ఫైవ్ స్టార్‌ యాడ్‌లో రమేష్‌, సురేష్ అన్నట్లు కనిపించిన బీజేపీ, వైసీపీ మధ్య.. సడెన్‌గా ఏం జరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయ్ చాలామందికి ! ఉరుము లేని పిడుగులా.. జగన్‌ను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసింది.. రెండు పార్టీల మధ్య అసలేం జరిగిందనే చర్చ మొదలైంది.

అమిత్ షా నుంచి నడ్డా, భువనేశ్వరి వరకు అందరిదీ ఒకే మాట. జగన్‌ అవినీతి చేశారు.. జగన్‌ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని ! గత 9ఏళ్లలో ఏపీకి 5లక్షల కోట్లు ఇచ్చామని ఒకరు అంటే.. వైసీపీ మైనింగ్‌ మాఫియాకు విశాఖ అడ్డాగా మారిందని ఇంకొకరు ఆరోపణలు గుప్పించారు. ఇది నిజమా.. అబద్దమా.. కావాలని బీజేపీ జగన్‌ను టార్గెట్ చేస్తుందా.. దీని వెనక రాజకీయం ఉందా అన్న సంగతి పక్కనపెడతే.. ఇంత అవినీతి జరుగుతుంది అని తెలిసినప్పుడు… చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అమిత్ షా జీ అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

మీరు అనుకోవాలే కానీ.. తలుచుకోవాలే కానీ.. విచారణ సంస్థలను ఏపీకి పంపించడం.. కూపీ లాగడం ఎంతసేపు పని చెప్పండి అని నిలదీస్తున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరుగుతుందని ఇలా ఉప్పు అందిందో లేదో.. సీబీఐ, ఈడీ రంగంలోకి దిగిపోయాయ్. లిక్కర్‌ స్కామ్‌లో అవినీతి జరిగిందని సీబీఐని దింపిన మీరు.. ఏపీలో నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎందుకు చేతులు నలుపుకుంటూ కూర్చున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఏపీలో జరగని కుంభకోణం లేదు అన్నారు.. విశాఖ అరాచకానికి అడ్డాగా మారిందన్నారు.. నిజమే అనుకుందాం కాసేపు ! కేంద్ర సంస్థలను రంగంలోకి దింపి.. ఈ సమస్యను బయటపెట్టొచ్చు కదా.. చెక్‌ పెట్టొచ్చు కదా ! ఇక్కడి వరకు ఎందుకు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ, కుమారుడి పాత్ర ఉందని తేలింది.

అక్కడ కూపీ లాగినా.. డొంక ఏపీలో కదులుతుంది కదా.. ఎందుకు అలా చేయలేకపోతున్నారు. అలా చేయలేకపోతున్నారంటే.. చేసిన ఆరోపణలు.. సంధించిన విమర్శలన్నీ ఉత్త ముచ్చట్లేనా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. బీజేపీ, వైసీపీ మధ్య పరోక్షంగా దోస్తీ ఉందనేది ఓపెన్‌ సీక్రెట్‌. ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న సమయంలో.. సడెన్‌గా ఓ ఫైన్ ఈవినింగ్ ఫ్లైట్‌ వేసుకొని వచ్చి.. మిత్రుడిని శత్రువులా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే.. నమ్మేంత అమాయకులు లేరు ఎవరూ ఇక్కడ ! ఇదే చర్చ జరగుతోంది చాలామందిలో. నిజంగా అవినీతి జరిగి ఉంటే.. ఢిల్లీలో చూపించిన దూకుడు ఇక్కడెందుకు చూపించరు.. చర్యలు ఎందుకు తీసుకోరు.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ప్లీజ్ అమిత్ షా జీ !