తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి వికారాబాద్‌లోని దామగుండం మీదే ఉంది. వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భూమి పూజ చేయడంతో దీనిపై అనేక దంగరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అడవిని నాశనం చేస్తున్నారంటూ ప్రకృతి ప్రేమికులు వ్యతిరేకిస్తుంటే.. అవసరంలేని ప్రాజెక్ట్‌తో నష్టమేనని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అసలు ఏంటి ఈ రాడార్ స్టేషన్ అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను విశాఖ కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ నిర్మించబోతోంది. 2,500 కోట్లతో 2027 నాటికి ఈ స్టేషన్‌ని అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ భావిస్తోంది.
ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. దేశంలోని రక్షణ శాఖ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ స్టేషన్ వల్ల.. పర్యావరణానికి, అటవీ సంపదకు ఎలాంటి హాని జరగదని మరి మరీ చెప్తున్నారు. కానీ దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే.. నేవీ రాడార్ స్టేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేసేశారు. నిజానికి.. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతం అనువైన ప్రాంతంగా భావిస్తారు. కానీ.. ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మించాలని నేవీ ప్రతిపాదించింది. ఈ స్టేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్‌జిల్లా పూడుర్ మండలంలోని దామగుండం ఫారెస్ట్ ఏరియాలోని 2901 ఎకరాలను నేవీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను నేవీ ఏర్పాటు చేస్తోంది. ఈ వీఎల్ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు. అలాగే.. రక్షణ రంగంతో పాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. దామగుండం ఫారెస్ట్ పూర్తి విస్తీర్ణం 3,261 ఎకరాలు. ఈ అడవిని ఆనుకుని దాదాపు 20 పల్లెలు, తండాలు ఉన్నాయి. పశువుల మేతకు, ఇతరత్రా అవసరాలకు ఆయా గ్రామల ప్రజలంతా ఈ అడవి ప్రాంతం మీదే ఆధారపడతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు వంకలు కూడా ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉండే అటవీ కప్రాంతంలో జీవవైవిధ్యం ళ్లకు కట్టినట్టుంటుంది. ఇలాంటి ప్రాంతంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండటం ఇప్పుడు అందరి మనసుల్లో అలజడి సృష్టిస్తోంది.
నేవీ రాడార్ కోసం కేటాయించిన 2901 ఎకరాల్లో.. స్టేషన్‌తో పాటు ఇందులో పని చేసే సుమారు 600 మంది సిబ్బంది స్థానికంగా నివసించేందుకు టౌన్షిప్ కూడా నిర్మించనున్నారు. వీళ్ల కోసం ఆస్పత్రులు, బ్యాంక్, మార్కెట్ ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా రెండున్నర వేల మంది ఈ ప్రాంతంలో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఆ ప్రాంతం చుట్టూ.. 27 కిలోమీటర్ల మేర ప్రహారీ గోడ కూడా నిర్మించనున్నారు.రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల్లో సుమారు 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా.. 208 రకాలకు చెందిన జీవరాశులు ప్రమాదంలో పడనున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ద్వారా వచ్చే రేడియేషన్ వల్ల చుట్టుపక్క ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరోవైపు.. మూసీనది ప్రక్షాళన చేస్తామంటోన్న ప్రభుత్వం.. దాని జన్మస్థానం అయిన అనంతగిరి కొండల్లో ఈ ఫారెస్ట్‌ను లేకుండా చేస్తుండటంతో.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్ణయంతో హైదరాబాద్‌కు వరద ముంపు కూడా ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా.. ఈ రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు దశాబ్దకాలంగా అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం కూడా చేస్తున్నారు. అయితే.. ఈ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై అనుమానాలు, ఆందోళనలపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్ ప్రాజెక్ట్‌కి కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో కేవలం 48 శాతం మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించనున్నట్టు చెప్తున్నారు. మిగిలిన 52 శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగబోదని వివరిస్తున్నారు. ఇక.. 12 లక్షల చెట్లను తొలగిస్తారన్న వాదనల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదని.. కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సంఖ్యను కూడా ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇక్కడ తొలగిస్తున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2,348 హెక్టార్ల స్థలంలో.. 17.55 లక్షల మొక్కలు నాటి.. అటవి సమతుల్యతను కాపాడనున్నట్టు వివరిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో.. పలు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఎలా డీల్ చేయనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.