TDP With BJP: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పొడిచేదెప్పుడు..? టీడీపీతో కలిసేందుకు బీజేపీ రెడీగా లేదా..? అమిత్‌షా, చంద్రబాబు ఏదో దాస్తున్నారు. అదేంటి..?
2014రిపీట్ అవుతుందని, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి జగన్‌పై యుద్ధం చేస్తాయని ఏపీలో తెలుగు తమ్ముళ్లు, పవన్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. నిజానికి బీజేపీతో కలవడం వల్ల ఈ రెండు పార్టీలకు ఓట్ల విషయంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన పనులు ఏ ఇబ్బంది లేకుండా చేయించుకోవచ్చు. ఇక జగన్‌పై సీబీఐ కేసులు ఎలాగో ఉన్నాయి. కేంద్రం ఏం చెబితే సీబీఐ అదే చేస్తుందన్నది ఇండియాలో స్కూల్ పిల్లోడికి కూడా తెలుసు. అందుకే బీజేపీతో పొత్తు టీడీపీ-జనసేనకు వ్యూహాత్మకం. ఈ కారణంతోనే జనసేన మొదటి నుంచి టీడీపీకి బీజేపీకి మధ్య వారధిలా నిలబడుతోంది. మూడు పార్టీలు కలవాలని కోరుకుంటోంది. అయితే కేంద్రంలోని బీజేపీ మాత్రం ఇప్పటివరకు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా అమిత్‌షా, చంద్రబాబు భేటీ తర్వాత కూడా ఈ విషయంపై క్లారిటీ రాలేదు.
ఇదంతా డ్రామానా?
చంద్రబాబు, అమిత్‌షా రాజకీయాల్లో ఎంతో తెలివైనవాళ్లు. 2019లో ఓటమికి ముందు, ఓటమి తర్వాత చంద్రబాబు బుర్ర కాస్త మందగించినట్టే అనిపించినా 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న టీడీపీ అధినేతను తక్కువ అంచనా వేస్తే జగన్ బొక్క బొర్లా పడడం ఖాయం. అటు దక్షిణ భారతంలో తమ పార్టీని విస్తరించాలని చూస్తున్న అమిత్‌షా, మోదీ.. ఏపీ విషయంలో కాస్త అచితూచి అడుగులేస్తున్నారు. తొందరపడి ఏ నిర్ణయామూ తీసుకోవడంలేదు. జగన్‌తో సఖ్యతగా ఉన్నట్టు నటిస్తూనే బాబుకు దగ్గరవుతున్నారు. చివరి నిమిషం వరుకు ఎటూ తేల్చకుండా ఉండాలన్నది అమిత్‌షా ప్లాన్ కావొచ్చు. ఎందుకంటే అప్పటికీ టీడీపీ-జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ రెండు పార్టీలతో పొత్తు పెద్దగా ఉపయోగం లేదనిపిస్తే బీజేపీ నిర్మోహమాటంగా జనసేనని వదిలేసే అవకాశముంటుంది. అదే సమయంలో వైసీపీకి బీజేపీ దగ్గర అవ్వొచ్చు. అందుకే చివరి నిమిషం వరకు బీజేపీ డబుల్ గేమ్ ఆడే అవకాశాలే కనిపిస్తున్నాయి.
కావాలనే యాక్ట్ చేస్తున్నారా?
బీజేపీ రెండు నాల్కల ధోరణి సంగతి పక్కన పెడితే ఇదంతా చంద్రబాబు, అమిత్‌షా కలిసి ఆడుతున్న నాటకమే కావొచ్చు. చివరి వరకు పొత్తు లేదని యాక్టింగ్ చేస్తూ, లాస్ట్ మినిట్‌లో మూడు పార్టీలు మూకుమ్మడిగా జగన్‌పై దాడి చేయొచ్చు. జగన్ అప్పటివరకు బీజేపీకి పార్లమెంట్‌లో మద్దతు ఇస్తూ ఉండే అవకాశాలే ఉన్నాయి. అప్పుడు జగన్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవతుంది. ఎందుకంటే జగన్ దృష్టిలో ఇప్పటికీ ఆయన కేంద్రంతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టే లెక్క. ఆ సీక్రెట్ రిలేషన్‌షిప్ చేడిపోయేలాగా అమిత్‌షా జగన్‌కు గట్టి దెబ్బకొట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కేంద్రంలోని బీజేపీకే ప్లస్‌గా మారనుంది.