No Confidence Motion: పార్లమెంట్ సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాని కోరిన ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రధాని నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నాయి. బుధవారం ఉదయం కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.
నోటీసులకు స్పందించిన స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించారు. ఈ అవిశ్వాసం ఎలాగూ వీగిపోతుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయితే, ఈ తీర్మానం వల్ల దీనిపై విస్తృత చర్చకు అవకాశం ఉంటుందనే కారణంతోనే ప్రతిపక్షాలు ఈ పని చేశాయి. ఈ తీర్మానం వల్ల ప్రధాని మోదీ తప్పకుండా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే తమకూ మాట్లాడే అవకాశం వస్తుందని, తమ స్పందన తెలియజేసే అవకాశం దొరుకుతుందని ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులను అడిగారు. దీంతో సోనియా గాంధీతోపాటు విపక్ష సభ్యులు ఈ తీర్మానానికి మద్దతుగా లేచి నిలుచున్నారు.
చర్చకు అవసరమైన మద్దతు ఉండటంతో స్పీకర్ చర్చకు అనుమతించారు. తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో 50 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇక చర్చతోపాటు, అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టేది ఇతర పార్టీలతో చర్చించి, సమయం ప్రకటిస్తానని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని, ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తీర్మానంలో ప్రతిపక్షంలో 26 పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా బీఆర్ఎస్ కూడా నోటీస్ జారీ చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీతో కాకుండా.. బీఆర్ఎస్ సొంతంగా నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్.. బీజేపీతో ఒప్పందంలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు వాదనలకు చెక్ పెట్టేలా బీఆర్‌ఎస్ వ్యవహరించింది.
అటు కాంగ్రెస్‌తో కలిసి కాకుండా.. విడిగా బీజేపీకి వ్యతిరేకంగా నోటీసు ఇచ్చింది. దీని ద్వారా తాము కాంగ్రెస్‌తో కలిసి లేమని చెప్పడంతోపాటు.. బీజేపీని కూడా వ్యతిరేకిస్తున్నామని రుజువు చేసినట్లైంది. ఈ నోటీసు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్.. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతుందని స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. మోదీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. అయితే, ఈ చర్య ద్వారా బీఆర్ఎస్ తాము ఎవరితోనూ ఎలాంటి ఒప్పందంలో లేమని చెప్పుకొనేందుకు అవకాశం దొరికింది.