No Confidence Motion: అవిశ్వాసంపై చర్చకు ముహూర్తం ఫిక్స్.. 10న ప్రధాని సమాధానం

ఈ నెల 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్, ప్రధాని ప్రకటన ఉంటాయి. మూడు రోజుల్ని అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్ కేటాయించారు. గత నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 02:16 PM IST

No Confidence Motion: మణిపూర్ హింస ఘటనలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్, ప్రధాని ప్రకటన ఉంటాయి. మూడు రోజుల్ని అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్ కేటాయించారు. గత నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.

అయితే, సమావేశాల ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై సభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నుంచి స్పందన లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయంచుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం. కాగా, దీనికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే టీఆర్ బాలు సహా ఇండియా కూటమికి చెందిన పలువుు ఎంపీలు మద్దతు ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వీళ్లంతా లేచి నిలబడ్డారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఖాయమైంది. తీర్మానానికి ఆమోదం తెలిపిన పదిరోజుల్లోపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే, పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న కారణంగా తీర్మానం వాయిదా పడింది.

తాజాగా ఈ నెల 8-10 వరకు తీర్మానానికి స్పీకర్ అంగీకరించారు. మూడు రోజులపాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. 10న ప్రధాని మోదీ ఈ అంశంపై సభలో ప్రకటన చేస్తారు. ఎలా చూసినా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. బీజేపీకి సభలో మూడింట రెండువంతులు మెజారిటీ ఉంది. ఎన్డీయేతోపాటు ఈ కూటమిలో లేని వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని కాంగ్రెస్‌కు కూడా తెలుసు. అయితే, దీనిద్వారా నైతికంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని, మణిపూర్ అంశంపై చర్చ జరిగేలా చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ చర్చ తర్వాత ప్రధాని ఇచ్చే సమాధానాన్నిబట్టి ప్రతిపక్షాలు తమ తదుపరి కార్యాచరణ రూపొందిస్తాయి. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఇది రెండో అవిశ్వాసం. 2018లో మొదటిసారి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వగా.. బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది.