Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా..!

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని చంద్రబాబు కోరారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు

  • Written By:
  • Updated On - October 3, 2023 / 02:37 PM IST

Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసులపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మసానం ఆదేశించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, అభిషేస్ సింఘ్వి వాదించగా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని చంద్రబాబు కోరారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, ఇది చెల్లదని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏ నిర్వచనాన్ని సాల్వే కోర్టులో చదివి వినిపించారు. చంద్రబాబుపై నమోదైన స్కాం 2015-16 మధ్య కాలంలో జరిగిందని, సెక్షన్ 17ఏకు చట్ట సవరణలు 2018 జరిగాయని జస్టిస్ ద్వివేది గుర్తు చేశారు. 2018జులైకు ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తింపచేయడంలో అర్థం లేదన్నారు. ఈ చట్టం ప్రకారం చట్టపరమైన రక్షణలు పిటిషనర్‌కు వర్తిస్తాయని సాల్వే పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణ‍యాలకు చంద్రబాబు ఒక్కరే బాధ్యులు కారని, అధికార నిర్వహణలో ఆ నిర్ణయాలు భాగమన్నారు. ట్రాప్ కేసు తప్ప.. మిగిలిన ఆరు రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు వ్యవహారంలో సెక్షన్ 17ఏ ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు బెయిల్ కోరకుండా.. క్వాష్ పిటిషన్లపైనే వాదిస్తున్నారన్నారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని వివరాలు కోర్టుకు సమర్పించాలని సుప్రీం ధర్మాసనం కోరింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలు మొత్తం సుప్రీం కోర్టులో అందజేయాలని జడ్జిలు ఆదేశించారు. చంద్రబాబు తరఫు లాయర్లు అన్ని డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే, కోర్టు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలిన ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్లు అడిగారు. దీంతో కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆ రోజు అన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.