T Congress: టీ కాంగ్రెస్‌లోకి వలసలు ఆగిపోయాయా..? కొత్త నేతల చేరికలేవి..?

జూపల్లి, పొంగులేటి చేరిక సమయంలో కాంగ్రెస్‌కు మంచి హైప్ వచ్చింది. వీళ్లతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని, చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 05:12 PM IST

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌‌లోకి వలసలు ఆగినట్లు కనిపిస్తోంది. జూపల్లి, పొంగులేటి తర్వాత ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలెవరూ ఆ పార్టీలోకి చేరలేదు. వాళ్లిద్దరి చేరిక కూడా దాదాపు రెండు నెలల క్రితమే ఖరారైంది. అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలెవరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదు.

జూపల్లి, పొంగులేటి చేరిక సమయంలో కాంగ్రెస్‌కు మంచి హైప్ వచ్చింది. వీళ్లతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని, చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. దాదాపు ముప్పై మంది కీలక నేతలు పార్టీలోకి రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. ఇటీవలి కాలంలో చేరికలు ఆగిపోయాయి. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ నుంచి నేతలెవరూ పెద్దగా ఇప్పటికైతే బయటికి రావడం లేదు. బీజేపీ నుంచి కూడా ఒకరిద్దరు మినహా నేతలు పార్టీ వీడుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్‌లోకి వలసలు ఆగిపోయాయి. నిజంగానే ఇతర నేతలెవరూ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదా అన్నది తాజా సందేహం. కొంతమంతి నేతలు గతంలో కాంగ్రెస్ వైపు చూసిన మాట నిజం. వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిస్థితుల్ని అంచనావేసుకుని వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరితే ఇబ్బందులు తప్పవని ఆయా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల్లో ఉంటే ఏ ఇబ్బందీ లేదు. కానీ, కాంగ్రెస్‌లో చేరితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన త్వరలోనే రానుంది. అప్పటిరవకు కాస్త వేచి చూసే ధోరణిలో ఇంకొంతమంది నేతలున్నారు. ఎన్నికలు దగ్గరపడే సమయానికి అప్పటి పరిస్థితికి అనుగుణంగా పార్టీని ఎంచుకోవాలని నేతలు భావిస్తున్నారు. దీంతో కొంతకాలంపాటు కాంగ్రెస్‌లోకి వలసలు పెద్దగా ఉండకపోవచ్చు.