One Nation-One Election: తెలంగాణలో ఈ ఏడాది చివరికల్లా ఎన్నికలు జరగాలి. దీనికి అనుగుణంగా ఇప్పటికే ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అయితే, కేంద్రం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలు (వన్ నేషన్–వన్ ఎలక్షన్) అమలైతే తమకు తీవ్ర ఇబ్బంది తప్పదని నేతలు ఆందోళన చెందుతున్నారు. కారణం.. ఎన్నికలు ఆలస్యమైతే, ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఈ భారాన్ని ఎలా మోయాలో తెలియక నేతలు తలలుపట్టుకుంటున్నారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో డిసెంబర్‌లోపు ఎన్నికలు జరగాలి. ఒకవేళ కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే మాత్రం మరో రెండు నెలలు ఆలస్యంగా ఎన్నికలు జరగొచ్చు. ఇది నాలుగు నెలలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ నేతల్ని టెన్షన్ పెడుతోంది. ఎన్నికలు త్వరగా పూర్తైతే, ఎన్నికల వ్యయం తగ్గుతుంది. ఎన్నికల కోసం నేతలు భారీగా ఖర్చు పెట్టుకోవాలి అనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిరంతరం ప్రచారానికి ఖర్చు చేయాలి.
స్థానిక నేతలు, కార్యకర్తలను పోషించాలి. స్థానికంగా ఎలాంటి వేడుకలు జరిగినా హాజరవ్వాలి. ఆర్థిక సాయం అందించాలి. యువజన సంఘాలు, కుల సంఘాలకు నగదు ఇవ్వాలి. ఆలయాలు, చర్చిలు, మసీదులకు సాయం అందించాల్సి ఉంటుంది. అసలే రాబోయేది పండుగల సీజన్. వచ్చే వినాయక చవితి సందర్భంగా భారీగా చందాలు ఇవ్వాలి. అలాగే బతుకమ్మ, దసరా, దీపావళి వంటి వేడుకల సందర్భంగా కూడా చాలా ఖర్చు చేయాలి. నేతలు చేజారకుండా చూసుకోవాలి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేసి ఆదుకోవాలి. ఇంత చేసినా గెలుపు గ్యారెంటీ అనే ధీమా లేదు.
సిట్టింగులకు లాభమే..!
ఎన్నికలు ఆలస్యమైతే కొంతమేర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లాభం కలిగే అవకాశం ఉంది. మరికొంత కాలం పదవిలో ఉండే ఛాన్స్ ఉంది. ఆలోపు నిధులు సమకూర్చుకోవచ్చు. టిక్కెట్ పొందిన అభ్యర్థులు, ఆశావహుల్లో మాత్రం టెన్షన్ తప్పదు. ఎన్నికలు ఆలస్యమయ్యేకొద్దీ నిధులు సమకూర్చుకోవడం, ఖర్చు పెట్టడం నేతలకు పెద్ద సవాలే. మరోవైపు ఎన్నికల సమయానికి పరిస్థితి మారిపోవచ్చు. గెలుస్తారనుకునే అభ్యర్థులకు ఆదరణ తగ్గొచ్చు. పోటీలో లేని వ్యక్తులకు ఆదరణ పెరగొచ్చు. ఇలా ఏ రకంగా చూసినా ప్రతి నేతకూ టెన్షన్ తప్పేలా లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మందు, మాంసం, నగదు పంపిణీ, బహమతులు, వేడుకలు వంటి వాటి కోసం నేతలు భారీగా ఖర్చు చేయాలి.
అత్యంత ఖరీదైన ఎన్నికలు
దేశంలోనే తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారబోతున్నాయి. ఇప్పటికే నేతలు ప్రచారంలోకి దిగిపోయారు. ప్రచారం కోసం, కిందిస్థాయి నేతల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చే ఏడాది జరిగితే.. అప్పటిదాకా కోట్ల నిధులు ఖర్చు చేయాలి. సగటున కొన్ని నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని నేతలు అంటున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణతో ఇతర రాష్ట్రాలకంటే రాజకీయంగా ఎక్కువగా ఇబ్బంది పడేది తెలంగాణే. ఎందుకంటే తెలంగాణలోనే ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అధికార పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా పార్టీల అభ్యర్థుల ప్రకటన కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతారు. ఆ తర్వాత నిధుల వరద పారించాల్సిందే.