Opposition Meet: ఇండియాగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి.. ప్రధాని పదవిపై ఆసక్తి లేదన్న కాంగ్రెస్!

మొత్తం 26 పార్టీలు ఈ సమావేశానికి హాజరైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇండియా పేరులో అలయెన్స్ అనే పదం విషయంలో కమ్యూనిస్టులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు మాత్రం దీనికి పూర్తి మద్దతు ప్రకటించాయి. కూటమి పేరులో ఫ‌్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని పార్టీలు సూచించడం వల్ల అలయెన్స్ అనే పదాన్ని చేర్చారు.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 04:42 PM IST

Opposition Meet: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అనే పేరును ఖరారు చేశాయి. ఇక్కడ ఇండియా అంటే.. ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌ అని అర్థం. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా పిలవొచ్చు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో మంగళవారం ప్రతిపక్షాల భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీకి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు.

ఈ భేటీలో కాంగ్రెస్‌ సహా టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, పీడీపీ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, కేఎండీకే, ఎంఎంకే,ఎండీఎంకే, వీసీకే, కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు హాజరయ్యాయి. మొత్తం 26 పార్టీలు ఈ సమావేశానికి హాజరైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇండియా పేరులో అలయెన్స్ అనే పదం విషయంలో కమ్యూనిస్టులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు మాత్రం దీనికి పూర్తి మద్దతు ప్రకటించాయి. కూటమి పేరులో ఫ‌్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని పార్టీలు సూచించడం వల్ల అలయెన్స్ అనే పదాన్ని చేర్చారు. కూటమి అధ్యక్ష లేదా కన్వీనర్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ బాధ్యతల్ని సీనియర్ పొలిటీషియన్ సోనియా గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రధాని పదవిపై ఆసక్తి లేదన్న కాంగ్రెస్
ప్రతిపక్ష సమావేశంలో కీలకంగా చెప్పుకోదగ్గ అంశం.. ప్రధాని పదవిపై ఆసక్తి లేదని కాంగ్రెస్ ప్రకటించడమే. నిజానికి ప్రతిపక్ష కూటమిలో బలమైన పార్టీ కాంగ్రెస్‌నే. ఈ పార్టీకి అత్యధికంగా పార్లమెంట్ ఎంపీలున్నారు. ప్రతిపక్షాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్సే. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధాని పదవి ఆశించే అర్హత కాంగ్రెస్‌కు ఉంది. కానీ, దీనివల్ల ఇతర పార్టీల మద్దతు దక్కే అవకాశం తక్కువ. అందుకే ప్రధాని పదవిపై ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. సమ భావజాలం కలిగిన పార్టీలన్నీ కలసి ఒకే లక్ష్యం కోసం ఉమ్మడిగా పోరాడుతామని ఖర్గే అన్నారు. ప్రస్తుతం తమ కూటమిలో 26 పార్టీలే ఉన్నప్పటికీ, తమ పార్టీలు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఎన్డీయే కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ వాటిని ఓట్లు, సీట్ల కోసం బీజేపీ వాడుకుంటుందని, ఆ తర్వాత వదిలేస్తుందని ఎద్దేవా చేశారు. కొత్త మిత్రుల కోసం ఇప్పుడు బీజేపీ పరుగులు పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో కలిసి పని చేసే అంశంపై ప్రతిపక్షాలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఇందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకుంటాయి. ఆ తర్వాత బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాల్లో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటారు. కాగా, ప్రతిపక్షాల కూటమిని సొంత ప్రయోజనాల కోసం ఏర్పడుతున్న కూటమి అని ప్రధాని విమర్శించారు. మంగళవారం ఎన్డీయే కూటమి కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే.
కీలక నేతలు హాజరు
ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ, కీలక నేతలు, సీఎంలు మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, భవంత్ మాన్ సింగ్‌తోపాటు మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీతోపాటు సీతారాం ఏచూరి, డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, వైగో, జయంత్ ఛౌదురి, తదితరులు హాజరయ్యారు.