Parliament Session: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. బలం లేకున్నా సిద్ధమవుతున్న విపక్షాలు

ప్రధాని మోదీ మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. బుధవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 09:11 AM IST

Parliament Session: మణిపూర్ హింసపై పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. బుధవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అయితే, ఈ విషయంలో ప్రభుత్వానికే మెజారిటీ ఉంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. అందులో ప్రభుత్వం నిలబడాలంటే 272 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. కానీ, ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 300కు పైగా సభ్యుల బలం ఉంది. కొన్ని పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరకపోయినప్పటికీ, బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఎన్డీయేకు ఎలాంటి నష్టం లేదు. కొన్నిపార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వకున్నా.. ప్రతిపక్షాల వైపు మొగ్గే అవకాశం కూడా లేదు. దీంతో ప్రతిపక్షాల బలం తగ్గుతుంది. ఎలా చూసినా అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. అయినప్పటికీ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

దీనికోసం చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇండియా కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు అన్నీ దీనికి అంగీకరిస్తే ఈ రోజే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అప్పుడే దీనికి స్పీకర్ అనుమతిస్తారు. తర్వాత స్పీకర్ నిర్ణయించిన పది రోజుల్లోగా అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విరుచుకపడేందుకు మరింత అవకాశం దొరుకుతుంది. కానీ, ప్రభుత్వం నెగ్గిన తర్వాత తిరిగి విమర్శలు తప్పవు. చివరగా 2018లో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అప్పుడు ఎన్డీయే కూటమికి 320 ఓట్లురాగా, ప్రతిపక్షాల కూటమికి 126 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

ఈ అంశంపై బుధవారం సాయంత్రంలోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో పలుసార్లు అవిశ్వాస తీర్మానాల్లో ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలున్నాయి. 1979 జులై 16న జరిగిన తీర్మానంలో అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్ ఓడిపోయి రాజీనామా చేశారు. చివరగా 1999లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయ్ కూడా అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటుతో ఓడిపోయారు. దీంతో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయింది.