Opposition Unity: మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతాయని భావిస్తుండగా, ఈ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 12న బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతిపక్షాల భేటీ రద్దైంది. ఈ విషయాన్ని నితీష్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇతర పార్టీలు, కాంగ్రెస్‌తో చర్చించిన తర్వాత తిరిగి సమావేశం జరిగే తేదీని ప్రకటిస్తామన్నారు. అయితే, ఈ భేటీ ఎందుకు రద్దైందో మాత్రం నితీష్ చెప్పలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ వైఖరివల్లే ఈ సమావేశం రద్దైందని భావిస్తున్నారు.
కాంగ్రెస్సే కారణమా?
కొంతకాలంగా ఎవరికి వారే అన్నట్లు ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఏకమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయంతో ఆ పార్టీకి మంచి ఊపొచ్చింది. దీంతో బీజేపీని సమర్ధంగా ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని ప్రతిపక్షాలు భావించాయి. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించాయి. కూటమి కట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న బిహార్‌లోని పాట్నాలో, నితీష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మోదీకి వ్యతిరేకంగా ఎలా పని చేయాలి.. వచ్చే ఎన్నికల్లో మోదీని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై చర్చించాలనుకున్నాయి. కానీ, అనూహ్యంగా ఈ సమావేశం రద్దైంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ పాత్రపై స్పష్టత లేదు. ప్రతిపక్షాల్లో బలమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇది జాతీయ పార్టీ. అరవై ఏళ్లకుపైగా దేశాన్ని పాలించింది.
అలాంటిది ప్రతిపక్షాల కూటమిలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా నితీష్ పెత్తనం చెలాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. కర్ణాటకలో విజయం ద్వారా మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాలని భావిస్తోంది. ఇతర పార్టీల ఆధ్వర్యంలో పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. గతంలో మోదీ, బీజేపీతో కలిసి పనిచేసిన నితీష్.. ఇప్పుడు అదే పార్టీపై పోరాడతానంటే నమ్మేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కూటమిలో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. అయితే జేడీయూ (నితీష్) కారణంగానే కేజ్రీవాల్, మమత ఒక్కతాటిపైకి వచ్చారని ఆ పార్టీ వాదిస్తోంది. కాంగ్రెస్ వల్ల ఇది సాధ్యమయ్యేది కాదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య అసలు ప్రతిపక్షాలు ఒకేతాటిపైకి వస్తాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు ఒక్కటి కాలేకపోతే.. అది బీజేపీ విజయానికి సహకరించినట్లే.
మరోవైపు ఈ సమావేశానికి పార్టీల అధ్యక్షులు మాత్రమే రావాలని, ప్రతినిధులను అంగీకరించబోమని నితీష్ చెప్పారు. దీని ప్రకారం.. 12న మల్లికార్జున ఖర్గే, రాహుల్ అందుబాటులో ఉండరని చెప్పినప్పటికీ నితీష్ వినిపించుకోలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పినట్లు, దీంతో సమావేశం రద్దైనట్లు తెలుస్తోంది. అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే కారణంతో కూడా ప్రతిపక్షాల భేటీని రద్దు చేశారు. దీంతో ఈ నెల 23న భేటీ నిర్వహించాలని జేడీయూ ప్రతిపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే, కొత్త తేదీని నిర్ణయించేందుకు కాస్త సమయం పడుతుంది. మరోవైపు ప్రతిపక్షాల భేటీపై కర్ణాటకకు చెందిన జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వ్యంగ్యంగా స్పందించారు. అసలు బీజేపీతో సంబంధం లేని పార్టీ ఉంటుందా అంటూ ప్రశ్నించారు.
అఖిలేష్‌తో కేజ్రీవాల్ భేటీ
ప్రతిపక్షాల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఆప్ తరఫున ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ కలిసి యూపీ, లక్నోలో సమాజ్‍వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీకి సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు ప్రతిపక్షాల భేటీపై కూడా వీళ్లు చర్చించినట్లు తెలుస్తోంది.