Manipur Violence: మణిపూర్ అంశంపై చర్చలో ముందడుగు.. వెనక్కు తగ్గిన ప్రతిపక్షాలు..

మణిపూర్ అంశంపై చర్చించే అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తాజాగా ప్రతిపక్షాలు కొత్త మార్గాన్ని సూచించాయి. అయితే, ప్రతిపక్షాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదో చూడాలి.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 03:05 PM IST

Manipur Violence: మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు తెరపడే ఛాన్స్ ఉంది. ఈ సమస్యకు మధ్యంతర పరిష్కారాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం ముందుంచాయి. ఈ అంశంపై చర్చించే అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తాజాగా ప్రతిపక్షాలు కొత్త మార్గాన్ని సూచించాయి. అయితే, ప్రతిపక్షాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదో చూడాలి. మణిపూర్ అంశంపై గతవారమే ఇండియా కూటమి తరఫున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

అయినప్పటికీ రాజ్యసభలో, లోక్‌సభలో ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనతో సభాకార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే, రూల్ నెంబర్ 267 కింద చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ రూల్ ప్రకారం.. పార్లమెంట్‌లో ఇతర అన్ని అంశాల్ని పక్కనబెట్టి, మణిపూర్‌పైనే చర్చించాల్సి ఉంటుంది. కానీ, దీనికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనివల్ల ఇతర అంశాలు చర్చకు రావని ప్రభుత్వం అంటోంది. దీనిబదులు రూల్ 176 ఆధారంగా చర్చించాలని ప్రభుత్వం అంటోంది. ఈ రూల్ ప్రకారం.. మణిపూర్ అంశంపై చర్చకు తక్కువ సమయమే ఉంటుంది. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. ఏ సెక్షన్ ప్రకారం చర్చించాలి అనే విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం సాగుతూ, సభకు ఆటంకం కలుగుతోంది.

అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ప్రభుత్వం కోరుకుంటున్న రూల్ 176 కాకుండా, ప్రతిపక్షాలు ముందునుంచి కోరుతున్న రూల్ 267 కాకుండా.. రూల్ 167 ప్రకారం చర్చించేందుకు అంగీకరించాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచాయి. మరి మోదీ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు అనేదానిమీదే సభాకార్యకలాపాల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. మణిపూర్ అంశంపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం అనేకసార్లు ప్రతిపక్షాలతో చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చలు విఫలమయ్యాయి. ఈసారి మాత్రం ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గి, సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ఏ రూల్‌పై చర్చ జరిగినా.. చివరకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబడుతున్నాయి.