Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సమయంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక అత్యుత్సాహంతో సభలో సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతోంది. మొదటి రోజు ప్రమాణస్వీకారం చేయని సభ్యులతో ఇవాళ ప్రమాణస్వీకారం చేయించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యేలంతా వరుసగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
ఇదే క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేశారు. అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో ఉన్న కౌశిక్ కూతురు శ్రీనిక అత్యుత్సాహం ప్రదర్శించింది. లవ్ యూ డాడీ అంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో సీఎం రేవంత్ సహా అంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీలో అలాంటి పనులు చేయొద్దంటూ చెప్పారు. ప్రచార సమయంలో కౌశిక్ రెడ్డి కూతురు ఇలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితోనే ప్రచారం నిర్వహించారు. ఎక్కడ ప్రచారం నిర్వహించినా తనతో పాటు తన కూతురితో కూడా ఓట్లు అభ్యర్థింపజేశారు. ఆఖరికి సీఎం హుజురాబాద్‌లో సభ నిర్వహించినప్పుడు కూడా కౌశిక్ కూతురు శ్రీనిక మాట్లాడిన తీరు అందిరినీ అశ్చర్యంతో పాటు ఒకింత అసహనానికి గురి చేసింది.
తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కాళ్లు పట్టుకుని ఐనా హుజురాబాద్ అభివృద్ధికి వెయ్యి కోట్లు తెప్పిస్తానంటూ రాజకీయ నాయకురాలిలా మాట్లాడింది శ్రీనిక. తరువాత ప్రచారంలో తన తండ్రి కోసం ఓట్లు అడిగిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. కూతురితో ఇలా ప్రచారం చేయించడమేంటని చాలా మంది కౌశిక్‌ను విమర్శించారు. కొన్ని రోజుల పాటు ఈ విషయం హాట్ టాపిక్‌గా నడిచింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీలో అల్లరి చేసి వార్తల్లో నిలిచింది కౌశిక్ కూతురు శ్రీనిక.