Pakistan: పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు..?

ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫారసుమేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుదవారం రాత్రి ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 05:13 PM IST

Pakistan: పాకిస్తాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫారసుమేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుదవారం రాత్రి ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో త్వరలోనే పాకిస్తాన్‌లో జనరల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత అంచనా ప్రకారం వచ్చే నవంబర్‌లో పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటివరకు షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది.
పాక్ అసెంబ్లీకి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ముందుగానే అసెంబ్లీ రద్దు చేయడానికి ఒక కారణం ఉంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ప్రభుత్వ పూర్తి గడువు ముగిసిన తర్వాత అసెంబ్లీ రద్దైతే.. తదుపరి ఎన్నికలు నిర్వహించేందుకు 60 రోజుల సమయం ఉంటుంది. అదే ముందుగానే ప్రభుత్వం రద్దైతే ఎన్నికలు నిర్వహించేందుకు 90 రోజుల సమయం ఉంటుంది. అంటే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల అదనంగా మరో నెల రోజుల సమయం ఉంటుంది. దీని ప్రకారం నవంబర్ వరకు ఎన్నికల నిర్వహణకు సమయం ఉంటుంది. అందుకే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగానే అసెంబ్లీ రద్దు చేసింది.
ఇమ్రాన్‌ ఖాన్‌కు ఛాన్స్ లేనట్లేనా..?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేసే అవకాశం లేదు. ఇది తమకు కలిసొస్తుందని షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఇమ్రాన్ జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ లేకపోవడం ఆయన పార్టీ పీటీఐకి భారీ నష్టమే. అయితే, ఇమ్రాన్ పైకోర్టులో అప్పీల్ చేసిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలై, ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని కొట్టిపారేయలేం. మరోవైపు పాకిస్తాన్‌లో ఇటీవలే జనగణన పూర్తైంది. దీని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే.. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మరింత సమయం పట్టొచ్చు. ఇది సాధ్యం కాకుంటే.. ఎన్నికల నిర్వహణను రెండు సంవత్సరాలపాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పాక్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం కూడా దేశాన్ని పీడిస్తోంది. ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణంతో దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.