FOURTH CAPITAL : పోయే ముందు పకోడీ ఐడియాలు… నాలుగో రాజధానితో పిచ్చెక్కిస్తున్నారు

ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్ళు కొనసాగించాలి అంటూ వైసీపీ (YCP) అగ్రనేత వై వి సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ ఏపీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతలకు పిచ్చెక్కిందా... లేక మరో కుటిల ఎన్నికల వ్యూహానికి ప్లాన్ చేస్తున్నారా అని జనం అనుమానిస్తున్నారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్ళు కొనసాగించాలి అంటూ వైసీపీ (YCP) అగ్రనేత వై వి సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ ఏపీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతలకు పిచ్చెక్కిందా… లేక మరో కుటిల ఎన్నికల వ్యూహానికి ప్లాన్ చేస్తున్నారా అని జనం అనుమానిస్తున్నారు. మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ సర్కార్ (Jagan Sarkar)… ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాల పరిమితిని పెంచాలని డిమాండ్ చేయడం ఏంటని తిట్టిపోస్తున్నారు. జరిగిన పొరపాటుకి నాలిక కరుచుకున్న జగన్ పరిస్థితిని చక్కదిద్దేందుకు కిందా మీదా పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళయింది. ఈ పదేళ్లలో ఏపీలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఒక స్థిరమైన రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోయారు. అమరావతి రాజధాని (Amaravati) అంటూ చంద్రబాబు (Chandrababu) ఐదేళ్లు షో చేస్తే, మూడు రాజధానులు అంటూ జగన్ జనానికి పిచ్చెక్కించారు. చివరికి ఏ రాజధాని లేకుండానే ఏపీ బతుకుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ, నేత, జగన్ బాబాయ్, ఉత్తరాంధ్ర ఇంచార్జ్… వైవి సుబ్బారెడ్డి (YV Subbar Reddy) బాంబు పేల్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితిని మరికొన్ని ఏళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. అంటే ఏపీకి నాలుగో రాజధానిని అడుగుతున్నారాయన.

ఇలాంటి పిచ్చిప్రాలాపన కోసమే… ఎదురుచూస్తున్న టీడీపీ వర్గాలు… సుబ్బారెడ్డి మాటలకు చెలరేగి పోయాయి. టీడీపీ (TDP), కమ్మ పత్రికల్లో కూడా ఈ ప్రతిపాదనపై దుమ్మెత్తి పోసాయి. ఎన్నికలకెళ్ళే ముందు వైసీపీ మరో చెత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని… ఉన్న రాజధానిని నాశనం చేసి. మళ్లీ ఉమ్మడి రాజధానిని కొనసాగించాలంటూ డిమాండ్ చేయడంలో ఏముందంటూ నిలదీసింది టీడీపీ.

విశాఖని రాజధాని చేద్దాం అనుకొని.. అభాసుపాలైన జగన్… ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టారు. కానీ సుబ్బారెడ్డి అత్యుత్సాహంతో రాజధాని అంశాన్ని కెలికారు. ఏపీని క్యాపిటల్ లేని రాష్ట్రంగా మార్చారని జనం సుబ్బారెడ్డి స్టేట్మెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రాజధాని నాశనం చేసి… మళ్లీ హైదరాబాద్ ను రాజధానిగా అడుగుతారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సీఎం జగన్ సంక్షోభ నివారణకు మంత్రి బొత్సాను (Botsa Satyanarayana) రంగంలోకి దించారు.

వైసీపీకి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. సుబ్బారెడ్డి మాటలు కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. రాజధాని విషయంలో జగన్ సర్కార్ చేసిన అరాచకం, పని కట్టుకొని అమరావతిని నాశనం చేయడం మూడు రాజధానులు అంటూ విశాఖలో చేరి అక్కడ టెన్షన్ సృష్టించడం… ఇవన్నీ జనం మర్చిపోలేదు. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాజధాని గురించి మాట్లాడటం మరీ విడ్డూరం. వీటన్నింటి ప్రభావం రాబోయే ఎన్నికలపై కచ్చితంగా ఉండే అవకాశముంది.