KCR: ఓవైపు పేపర్‌ లీక్స్.. మరోవైపు ఫైర్ యాక్సిడెంట్‌ .. కేసీఆర్‌ సర్కార్‌కు చుక్కలు !

పేపర్‌ లీకేజీ ఇలా రాజకీయాన్ని కుదిపేస్తుంటే.. సికింద్రాబాద్‌ స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటన కేసీఆర్ సర్కార్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు చనిపోగా.. దీనిపై కూడా ప్రతిపక్షాల నుంచి కే‌సి‌ఆర్ సర్కారుకు నిరసన సెగలు తగులుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 03:41 PM IST

దెబ్బ మీద దెబ్బ అనిపిస్తోంది కేసీఆర్‌ సర్కార్‌కు ! ఒక వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే.. మరో ప్రమాదం.. ఇలా సాగుతోంది కొన్నాళ్లుగా తీరు. ఇప్పుడు అదే కనిపిస్తోంది. ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయ్ ఇప్పుడు తెలంగాణలో ! టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం మిగిల్చిన రచ్చ అంతా ఇంతా కాదు. లీకేజ్ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయ్. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ నిరాహార దీక్ష చేస్తుంటే.. బీజేపీ అయితే అంతకుమించి అనే స్థాయిలో దూకుడు చూపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైటీపీ.. ఇలా అన్ని పార్టీలు పేపర్ లీకేజీ వ్యవహారంలో రోడ్డెక్కుతున్నాయ్. ఈ కేసును సీబీఐకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ నిరాహార దీక్షకు దిగారు. అమరవీరుల స్థూపం దగ్గర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధర్నాకు దిగగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా పేపర్‌ లీకేజీ ఇలా రాజకీయాన్ని కుదిపేస్తుంటే.. సికింద్రాబాద్‌ స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటన కేసీఆర్ సర్కార్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు చనిపోగా.. దీనిపై కూడా ప్రతిపక్షాల నుంచి కే‌సి‌ఆర్ సర్కారుకు నిరసన సెగలు తగులుతున్నాయ్. రాంగోపాల్‌పేట్‌లో ఓ పాత భవంతిలో అగ్నిప్రమాదం మిగిల్చిన విషాదం మర్చిపోకముందే.. స్వప్నలోక్‌ ఘటన జరగడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. స్వప్నలోక్ బిల్డింగ్‌ కూడా పురాతనమైనదే ! ఇదే విపక్షాలకు ఆయుధంగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు వస్తున్నాయ్. ఐతే సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో నాలుగు పెద్ద అగ్నిప్రమాదాలు జిగాయ్. ఈ నాలుగు ప్రమాదాల్లో మొత్తం 28మంది చనిపోయారు.