Parliament Building: ప్రజాస్వామ్యానికి ప్రతీక.. నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఇవే!

దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో, 64,500 చదరపు మీటర్ల స్థలంలో దీన్ని నిర్మించారు. నాలుగు అంతస్థుల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల ఐదు నెలల 18 రోజులు పట్టింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైనర్ బిమల్ పటేల్ నూతన పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 05:00 PM IST

Parliament Building: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న జరగనుంది. ప్రధాని మోదీ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ భవనాన్ని జాతికి అంకితం చేస్తారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పక్కనబెడితే పార్లమెంట్ నూతన భవనానికి సంబంధించి అనేక విశేషాలున్నాయి.
ఇప్పటివరకు వినియోగిస్తున్న పాత పార్లమెంట్ భవనాన్ని 1927లో నిర్మించారు. మరో నాలుగేళ్లైతే దీనికి వందేళ్లు అవుతాయి. అయితే, ఈ భవనం పాతది కావడం, నేటి అవసరాలకు తగినట్లు లేకపోవడంతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 2021లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో, 64,500 చదరపు మీటర్ల స్థలంలో దీన్ని నిర్మించారు. నాలుగు అంతస్థుల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల ఐదు నెలల 18 రోజులు పట్టింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైనర్ బిమల్ పటేల్ నూతన పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. దాదాపు 60 వేల మంది కార్మికులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు అంచనా. 150 సంవత్సరాలపాటు నిలిచి ఉండేలా దీన్ని నిర్మించారు. ఇది జోన్-5 భూకంపాలను తట్టుకోగలదు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ నూతన భవనమే కాకుండా.. ప్రధానికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉప రాష్ట్రపతి కొత్త కార్యాలయం వంటివి నిర్మిస్తున్నారు.
పాత భవనంతో ఇబ్బందులు
దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన భవనం కావడంతో నేటి అవసరాలకు తగినట్లుగా ఆ భవనం లేదు. కాలానుగుణంగా ఇప్పటి అవసరాలు పెరిగాయి. దీనికి తగ్గట్లు నిరంతరం మార్పులు, మరమ్మతులు చేస్తూ వచ్చారు. విద్యుత్ కేబుల్స్, సీసీ కెమెరాలు, ఏసీలు, ఆడియో, వీడియో ఎక్విప్‌మెంట్ వంటివి ఏర్పాటు చేయాల్సి రావడంతో వీటి కోసం భవనంలో తవ్వకాలు జరిగేవి. ఇలా అనేకసార్లు జరగడంతో భవనం పటిష్టత దెబ్బతింది. అలాగే ఉభయ సభలు జరిగినప్పుడు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఒకేచోట కలిసి కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు లేవు. దీంతో ఈ సమయంలో అదనపు కుర్చీలు వేయాల్సి వచ్చేది. భవనం చాలా ఇరుకుగా మారింది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కొత్త భవనం నిర్మించాల్సి వచ్చింది.
ఆధునిక సదుపాయాలు
నూతన పార్లమెంట్ భవనంలో అనేక ఆధునిక సదుపాయాల్ని కల్పిస్తున్నారు. పాత పార్లమెంట్ భవనం లోపల లోక్‌సభలో 545 మంది సభ్యులు, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే వీలుంది. అయితే కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముందు జాగ్రత్తగా ఇలా సీటింగ్ కెపాసిటీ పెంచారు. పార్లమెంట్ సభ్యుల సీటు వద్దే మల్టీమీడియా సీటింగ్ సదుపాయం కల్పించారు. అంటే ఓటింగుకు వీలుగా సీటు వద్ద బయోమెట్రిక్ సదుపాయం, డిజిటల్ ట్రాన్స్‌లేషన్ డివైజెస్, మల్టీమీడియా డిస్‌ప్లే, మైక్రోఫోన్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకునేలా ఏర్పాట్లున్నాయి. మీడియా కోసం కూడా ప్రత్యేకంగా 530 సీట్లను ఏర్పాటు చేశారు. గ్యాలరీలో విజిటర్స్ ఎక్కడి నుంచి చూసినా లోపలి సభ్యులు స్పష్టంగా కనిపించేలా సీట్లను ఏర్పాటు చేశారు.


ద్వారాల పేర్లు ప్రత్యేకం
పార్లమెంట్ నూతన భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన,శక్తి, కర్మ అనే పేర్లు పెట్టారు. మూడు ద్వారాలనూ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి , యజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలు, శక్తి ద్వారానికి ఒక వైపున చాణక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు, కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
పాత భవనం సంగతేంటి?
పార్లమెంట్ నూతన భవనం అందుబాటులోకి వస్తున్న వేళ పాత భవనాన్ని ఏం చేస్తారనే సందేహం రావొచ్చు. పాత పార్లమెంట్ భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రత్యామ్నాయంగా కూడా వాడుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటులో జరిగే కొన్ని ఇతర కార్యక్రమాల కోసం దీన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా మార్పులు చేర్పులు, మరమ్మతులు చేయాలనుకుంటోంది. అయితే, దీన్ని కచ్చితంగా ఎలా వినియోగిస్తారు అనేం అంశంలో ఇంకా స్పష్టత లేదు.