ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో రెండు పార్టీలూ పోటాపోటీ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. రెండూ తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నటివరకూ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో వైసీపీ హడావుడి చేసింది. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికీ తిరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా నేతలు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి జగన్ స్టిక్కర్లు అతికించాలి. తమ హయాంలో ఆ ఇంటికి జరిగిన అభివృద్ధిని వివరించాలి. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు కాస్త జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు లాగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
మరోవైపు టీడీపీ కూడా వైసీపీకి ధీటుగా ముందుకెళ్తోంది. మొన్నటివరకూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఆ పార్టీ నేతలు చంద్రబాబు, లోకేశ్ సెల్ఫీలతో పిచ్చెక్కిస్తున్నారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను సెల్ఫీల రూపంలో ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా సెల్ఫీలతో చాటిచెప్తున్నారు.
అయితే టీడీపీ నేత కేశినేని చిన్ని మాత్రం విభన్నంగా ప్రచారం సాగిస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తుంటే.. కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ స్టిక్కర్లు వేస్తున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ తో పాటు కేశినేని చిన్ని ఫోటో ఉంది. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు అవసరం.. లాంటి అంశాలను ఫోకస్ చేస్తూ కేశినేని చిన్ని ప్రచారం మొదలు పెట్టారు. అయితే సోదరుడు కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కేశినేని చిన్ని హడావుడి చర్చనీయాంశమైంది.