Congress: కాంగ్రెస్‌ ఆ పద్ధతి మార్చుకోకపోతే మరోసారి మోదీదే విక్టరీ.. కేజ్రీవాల్‌ గడ్డి పెట్టినా హస్తం బుద్ధి అంతే..!

బీజేపీపై ఉమ్మడి పోరు అంటూ బిల్డప్‌లు ఇచ్చారు.. అందరూ పాట్నా వెళ్లారు.. అక్కడ మీటింగ్‌ పెట్టారు..ఆ భేటీ కాస్త ట్రాక్‌ తప్పింది. ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీగా మారాల్సిన చర్చ.. కాంగ్రెస్‌ వర్సెస్‌ ఆప్‌గా మారిపోయింది. మరోసారి కాంగ్రెస్‌ అసలు బుద్ధి బయటపడింది.

  • Written By:
  • Updated On - June 25, 2023 / 09:16 AM IST

Congress: ప్రతిపక్షాల కలయిక అసాధ్యమేనా..? కాంగ్రెస్‌ అహంతో అన్ని పార్టీలకు ఇబ్బంది కలుగుతోందా..? వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు బీజేపీదేనా..? పాట్నా మీటింగ్‌ చెబుతున్న సత్యం అదేనా..?
బీజేపీపై ఉమ్మడి పోరు అంటూ బిల్డప్‌లు ఇచ్చారు. అందరూ పాట్నా వెళ్లారు. అక్కడ మీటింగ్‌ పెట్టారు. ఆ భేటీ కాస్త ట్రాక్‌ తప్పింది. ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీగా మారాల్సిన చర్చ.. కాంగ్రెస్‌ వర్సెస్‌ ఆప్‌గా మారిపోయింది. మరోసారి కాంగ్రెస్‌ అసలు బుద్ధి బయటపడింది. తనమాటే నెగ్గాలని పంతాలకు పోవడంవల్లే కాంగ్రెస్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. అయినా ఇప్పటికీ మారినట్టు కనిపించడంలేదు. బీజేపీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో అన్నీ పార్టీల మాట ఒకటైతే కాంగ్రెస్‌ మాట మరొకటి. అందుకే ఆప్‌కి మండింది. కాంగ్రెస్‌ని కడిగిపారేసింది. ఈ దెబ్బతో ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. ప్రతిపక్షాల పొత్తు సాధ్యం కాదని. ఒకవేళ సాధ్యమైనా యూనిటీ లేకుండా మోదీని గద్దె దించడం అసాధ్యం..!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య గొడవ మొదలైంది. ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ వెనుకాడుతోంది. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీలు ముక్తకంఠంతో ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని.. అప్పుడే తాము విపక్ష కూటమిలో కొనసాగుతామని ఆప్ ప్రకటించడం సంచలనం రేపింది. దీనిపై ఆప్ అధికారిక ప్రకటన కూడా చేసిందంటే అరవింద్ కేజ్రీవాల్‌కి కాంగ్రెస్‌తో కలవడం ఏ మాత్రం ఇష్టం లేదని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం నాన్చుడు ధోరణి కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించడం, విభేదించడం పార్లమెంట్ బయట జరగవని, ఇప్పుడు ఆప్ దీన్ని ఎందుకింత ప్రచారం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై ఓ లుక్కేస్తే అసలు ఖర్గే వాదనలో లాజిక్‌ లేదనిపిస్తోంది. మాట వరుసకైనా బీజేపీ ఆర్డినెన్స్‌ని వ్యతిరేకిస్తున్నట్టు ఖర్గే చెప్పకపోవడం విడ్డూరం!
వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీదే గెలుపా?
బీజేపీ యాంటి మీటింగ్‌ అని అందరూ కలుసుకుని ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తుంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీదే గెలుపని అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఈ ప్రతిపక్షాల పొత్తు సాధ్యం కాదనే వాదనకు పాట్నా మీటింగ్‌ బలం చేకూర్చింది. కూటమిలో సీపీఎం ఉండటాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. సమావేశం తర్వాత కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సీపీఎంతో కలిసి తాము పనిచేయాలేమని స్పష్టం చేశారు. అటు సీపీఎం సైతం కాంగ్రెస్‌‌తో కలవడంపై రెండు విధాలుగా మాట్లాడింది. మరోవైపు ఆర్డినెన్స్‌ విషయంలో 11 పార్టీలన్నీ ఒకతాటిపై ఉంటే కాంగ్రెస్‌ వాళ్లతో ఏకీభవించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కి ఉన్న అహం మరే ఇతర పార్టీలకు ఉండదు. అది తగ్గించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెసే కారణమవుతుంది. ఇది పక్కా..!