తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న జనసేన (Janasena ) అభ్యర్థులకు అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఆ పార్టీకి గుర్తింపు లేకపోవడంతో… గాజు గ్లాసు సింబల్ రాలేదు… పైగా జాతీయ జనసేన అనే పార్టీ రంగంలోకి దిగింది… ఇక బీజేపీలో అసంతృప్తి నేతలు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తారో లేదో తెలియదు. ఇన్ని ఇబ్బందుల మధ్య జనంలోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నా… అసలు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అన్నది కూడా డౌట్ గా ఉంది. బీజేపీ (BJP) అభ్యర్థులు కూడా జనసేనాని కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా పవన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో మొదటిసారిగా పోటీచేస్తోంది జనసేన. కూకట్ పల్లి, కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావు పేట, వైరా, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోతమ అభ్యర్థులను నిలబెట్టింది. జన సేన లిస్ట్…. నామినేషన్ల గడువుకి ముందు రోజు ప్రకటించడం… ఆ తర్వాత దీపావళి పండగ రావడంతో… ఇప్పటిదాకా ఆ పార్టీ అభ్యర్థులెవరూ సరిగా ప్రచారమే మొదలుపెట్టలేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో BRS, కాంగ్రెస్ (BRS, Congress) పార్టీల అభ్యర్థులు ఈ నియోజకర్గాల్లో దూసుకుపోతున్నారు. BRS నుంచి అయితే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం… ప్రచారానికి వచ్చేది లేనిదీ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన తెలంగాణలో క్యాంపెయిన్ చేస్తే… జనసేన పార్టీ అభ్యర్థులతోపాటు… తమకు కూడా లాభం ఉంటుందని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. పవన్ ఇమేజ్ తో కొన్ని ఓట్లయినా పడతాయని కమలం పార్టీ అభ్యర్థులు ఆశగా ఉన్నారు.
కానీ తెలంగాణలో జనసేన ఎంతమేరకు పోటీ ఇస్తుందనేది డౌట్ గా ఉంది. BRS, కాంగ్రెస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కునే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ పవన్ కల్యాణ్ వచ్చి ప్రచారం చేసినా… రేపు పోలింగ్ ముగిశాక… కనీసం 2,3 స్థానాల్లో అయినా జనసేన అభ్యర్థులు గెలవకపోతే ఎలా అన్న భయం ఆ పార్టీ సీనియర్లలో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా… ఒక్కసీటైనా గెలవకపోతే రేపు ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న టెన్షన్ ఆ పార్టీ లీడర్లలో కనిపిస్తోంది. అందుకే అంటీ ముట్టనట్టుగా ఉండటమే బెటర్ అన్న వాదనలు కూడా ఉన్నాయి. అసలు జనసేన తెలంగాణలో పోటీ చేయకుండా ఉండే బాగుండేది… పవన్ కల్యాణ్ (Pavan Kalyan) మొహమాటం రాజకీయాలు చేస్తుండటం ఇబ్బందిగా మారిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.