తిరుపతి లడ్డూ – కల్తీ నెయ్యి వివాదం నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. అనంతరం తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటానని ఎక్స్ లో పవన్ పోస్ట్ చేసారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు ఆయన. జంతు అవశేషాలతో మాలిన్యమైందని విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు అని విమర్శించారు.
ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైందని అపరాధ భావానికి గురైందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిందని తెలిపారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని కోరారు.
రేపు 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను అని పవన్ పోస్ట్ చేసారు. కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ దీక్ష మొదలయింది. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం విచారణకు సిద్దమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో కల్తీ నిజమే అనే అనుమానాలు బలపడ్డాయి.
దానికి తోడు ఆవు నెయ్యి కేవలం 320 రూపాయలకు ఎలా వస్తుందనే ప్రశ్నలు వినిపించాయి. దీనిపై మాజీ సిఎం జగన్ వివరణ ఇచ్చినా ఇంకా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు అనే చెప్పాలి. ఇక హిందుత్వ సంఘాలు, హిందువులు, రాజకీయ పార్టీలు జగన్ పై ఆగ్రహంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై చర్యలు కూడా ఉండే అవకాశం కనపడుతోంది.