ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత పదేళ్ల నుంచి సినిమా రంగం పెద్దగా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టలేదు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమకు అనేక రాయితీలు కూడా ప్రకటించారు. చిన్న సినిమాలుకు కాస్త ఎక్కువగా అవకాశాలు కల్పించారు. రాష్ట్రంలో షూటింగ్ లు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలను కూడా రాష్ట్రంలో రాయితీలు ఇచ్చేందుకు అప్పట్లో సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే సినిమా పరిశ్రమ మాత్రం తెలంగాణపై ఎక్కువగా ప్రేమ ఉండటం హైదరాబాదులోనే వారి ఆస్తులు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు సిద్ధంగా లేరనే విషయం అప్పట్లోనే స్పష్టమైంది. గత ఐదేళ్ల నుంచి సినిమా పరిశ్రమ వైసిపి ప్రభుత్వం లో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సినిమా పరిశ్రమను మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే నూతన సినిమా పాలసీని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ తో సంబంధిత శాఖ అధికారులు భేటీ అయి పలు కీలక ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచారు. చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వడం, అలాగే ప్రభుత్వం తరఫున స్టూడియోల నిర్మాణం, అరకు మారేడుమిల్లి అలాగే చిత్తూరు వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్లకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, విజయవాడ సమీపంలో ఒక స్టూడియో నిర్మాణం అలాగే విశాఖ సమీపంలో ఒక ప్రభుత్వ స్టూడియో నిర్మాణం వంటివి చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.
అలాగే ప్రముఖ సినిమా నిర్మాతలకు స్థలాలను కూడా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ప్రతిపాదనలు కూడా తీసుకువెళ్లేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులకు అనువైన ప్రదేశాలు ఉన్నా సరే ఇతర రాష్ట్రాలకు వెళ్లి దర్శకులు షూటింగ్ చేయడం పట్ల ప్రభుత్వం కాస్త సీరియస్ గానే తీసుకుంది. ఇక సినిమా వాళ్లు విజయవాడ వరదల తర్వాత రాష్ట్రంపై కాస్త ఎక్కువగా ప్రేమ చూపించారు. దీంతో వాళ్లను ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని అవసరమైతే అమరావతిలో సినిమా వాళ్ళ కోసం ఫిలింనగర్ తరహాలో కొన్ని ఎకరాలను కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ, హైదరాబాద్ హైవేలో వారికి స్థలాలు కూడా కేటాయించే అవకాశం కనపడుతోంది.