Pawan Kalyan: తాను చేపట్టిన వారాహి యాత్రపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అంగళ్లు తరహా హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పవన్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదివారం అవనిగడ్డలో బహిరంగ సభ పూర్తికాగా.. బుధవారం పెడనలో వారాహి యాత్ర సాగనుంది. ఈ యాత్ర సందర్భంగా పెడనలో అలజడి సృష్టించేందుకు, జనసేన నేతలపై రాళ్ల దాడి చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు.
రాళ్ల దాడులకు ప్లాన్
గత ఆగస్టులో టీడీపీ అధినతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తిరగబడ్డారు. దీంతో పరస్పర దాడులతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులపైనా కొందరు దాడికి పాల్పడ్డారు. తీవ్ర హింస చెలరేగింది. ఇప్పుడు పెడనలో ఇదే తరహా దాడులకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు పవన్ ఆరోపించారు. రెండు, మూడు వేల మంది వరకు రౌడీ మూకలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, రాళ్ల దాడులు కూడా చేసే అవకాశం ఉందని ఆరోపించారు. దీనిపై తమకు సమాచారం ఉందని, ఈ దాడులకు ఏపీ ప్రభుత్వం, డీజీపీనే బాధ్యత వహించాలని చెప్పారు. పులివెందుల రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు పవన్.
సంయమనం పాటించాలన్న పవన్
మరోవైపు వైసీపీకి చెందిన అల్లరిమూకలు దాడులకు పాల్పడితే, జనసేన శ్రేణులు ప్రతిదాడులు చేయొద్దని పవన్ పిలుపునిచ్చారు. ఎవరైనా వస్తువులతో కనిపిస్తే, పట్టుకుని, పోలీసులకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం విపక్షాలపైనే దాడులు చేయించి, వారిపైనే కేసులు పెడుతోందన్నారు. బాధితులపైనే కేసులు పెట్టడం సరికాదన్నారు. పెడనలో దాడుల ఆరోపణలకు మరో కారణం కూడా ఉంది. ఇక్కడ జోగి రమేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. జోగి రమేష్ గతంలో తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాతే జోగి రమేష్‌కు మంత్రి పదవి లభించింది. పవన్ కల్యాణ్ అంటే జోగి రమేష్ మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. పవన్‌పై ఎప్పుడూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అందువల్లే ఈ నియోజకవర్గం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జనసేన శ్రేణులకు సూచించారు.