Pawan Kalyan: వాలంటీర్ల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో అమ్మాయిల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. ప్రజల దగ్గరి నుంచి వాలంటీర్లు సేకరించిన డాటా దుర్వినియోగం అవుతోందని పవన్ ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదన్నారు. గతంలో ఈ వ్యవస్థ లేనప్పుడు దేశమేమీ వెనుకబడిపోలేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అటు అధికార వైసీపీ నుంచి, ఇటు వాలంటీర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయితే, ఈ అంశంలో పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వాస్తవాలు, అవాస్తవాల గురించి మాత్రం సరైన చర్చ జరగడం లేదు.
నేరాల్లో వాలంటీర్లు
నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యల్లో చాలా నిజాలున్నాయి. కొన్నిచోట్ల వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారుతున్నాయి. తిరుపతిలో, శ్రీకాకుళంలో వాలంటీర్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన వారిలో ఒక దళిత యువతి కూడా ఉంది. మరోచోట అక్రమ మద్యం అమ్ముతూ వాలంటీర్ దొరికిపోయాడు. ఇంకోచోట ఒక వాలంటీర్ కత్తితో ముగ్గురిపై దాడిచేశాడు. వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎప్పుడో కాని వెలుగులోకి రావడం లేదు. ఇలాంటి ఎన్నో నేర ఘటనల వెనుక వాలంటీర్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పథకాల పేరుతో వాలంటీర్లు ప్రజల జీవితాల్లోకి చొరబడుతున్నట్లు పవన్ ఆరోపిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత, సున్నితమైన సమాచారం వాలంటీర్ల చేతిలోకి వెళ్తోంది. ఆ డేటా అక్కడ్నుంచి ఎటు చేరుతుందో స్పష్టత లేదు. ఈ డేటా దుర్వినియోగం అవుతోందని పవన్ అంటున్నారు.
పవన్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ
పవన్ వ్యాఖ్యల వల్ల ఏపీలో తొలిసారిగా వాలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రజల నుంచి భిన్న స్పందన వస్తోంది. కొందరు బహిరంగంగానే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారు. తాము చెప్పినట్లు నడుచుకోపోతే ప్రభుత్వ పథకాల అమలు చేయబోమంటూ హెచ్చరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాలంటీర్లపై అనేక చోట్ల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు వాలంటీర్లకు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ విషయంలో పవన్‌పై మండి పడుతోంది. వాలంటీర్లు కూడా పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ మహిళా కమిషన్ ఏకంగా పవన్‌కు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ పవన్ వెనక్కు తగ్గడం లేదు. పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. కరోనా సమయంలోనూ సేవ చేశారని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై చర్చ నడుస్తోంది. జనసేన, వైసీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మరోవైపు పవన్ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో కనిపించకుండా పోతున్న మహిళలు, పురుషుల గురించిన అంశం కూడా చర్చకు దారితీసింది. ఈ విషయంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. మిస్సింగ్ కేసులు భారీగా నమోదవుతున్న అంశంపై కూడా ప్రజలు చర్చిస్తున్నారు.