తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుమల కాలి నడకన వెళ్ళడం, నేడు ఉదయం దర్శనానికి వెళ్ళడం అన్నీ కాస్త హాట్ టాపిక్ అవుతూ వచ్చాయనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడటం కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. దానికి జనసేన కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తూ వస్తోంది.
ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ 11 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారని అయినా సరే ఆయన పట్టుదలగా తిరుమల మెట్లు ఎక్కారాని కాని జగన్ మాత్రం రాలేదని జనసేన అంటోంది. ఇక సినిమాల్లోనే హీరో, రియల్ లైఫ్ లో జీరో అంటూ పవన్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ తిరుపతి టూర్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి తన చిన్న కుమార్తె పలీనా అంజని కి డిక్లరేషన్ ఇచ్చారు అధికారులు.
టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసారు పలీనా అంజని. మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేసారు. తన కుమార్తె క్రిస్టియన్ అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీన్ని గమనిస్తున్న పరిశీలకులు ఇది కచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కు షాక్ అంటున్నారు. జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయడానికి నిరాకరిస్తున్న సమయంలో తన కుమార్తెతో తిరుమలలో పవన్ కళ్యాణ్ సంతకం చేయించడం హాట్ టాపిక్ అయింది.
తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ స్పందన కూడా కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది. అది జగన్ కోసమో లేదంటే మరొకరి కోసమో పెట్టిన రూల్ కాదని తిరుమల అధికారులు చెప్ప్తున్నారు. కాని జగన్ మాత్రం సంతకం చేయాల్సి వస్తుందనే తిరుమల వెళ్ళలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. మరి భవిష్యత్తులో జగన్ తిరుమల పర్యటనకు వెళ్తే సంతకం చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ విషయంలో కూటమి నేతలతో పాటుగా… హిందుత్వ సంస్థలు కూడా సీరియస్ గానే వ్యవహరించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాయి. మరి ఇప్పుడు పవన్ తన కుమార్తెతో సంతకం చేయించడం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.