Pawan Kalyan: సీట్ల విషయంలో పవన్‌కు క్లారిటీ వచ్చిందా ? చంద్రబాబు ముందు ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు ?

మధ్యలో స్లో అయినా.. బ్రేకులు పడుతున్నా.. టీడీపీతో జనసేన పొత్తు అనేది మాత్రం క్లియర్. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తెరవెనక జరగాల్సిందంతా జరిగిపోతోంది. సీట్ల పంపకాల నుంచి.. ప్రచార వ్యూహాల వరకు.. రెండు పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 02:26 PM IST

ఐతే జనసేనకు.. ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను కేటాయిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సీట్ల విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నా.. అధికారికంగా మాత్రం.. ఎలాంటి ప్రకటన రాలేదు. 25 ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఓసారి.. లాగితే 30వరకు వచ్చి ఆగిందని ఇంకోసారి.. రకరకాలుగా ప్రచారం జరుగుతోంది ఇలా. వచ్చే ఎన్నికల్లో బలం ఉన్న సీట్లలో మాత్రమే తాము పోటీ చేస్తామని.. అన్ని సీట్లలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఇష్టం లేదంటూ గతంలోనే ప్రకటించారు పవన్‌.

దీంతో టికెట్ల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య ఎలాంటి ప్రచారం, హడావుడి లేకుండా మంగళగిరి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. కీలక సమావేశాలు నిర్వహించారు. పార్టీ నాయకులు ఎవరు లేకుండానే చాలా వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలుస్తోంది. చివరికి మీడియాను కూడా దూరంగా పెట్టి.. ఆఫీస్‌లో పవన్‌ బిజీగా గడపడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. పవన్‌ కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారని… వచ్చే ఎన్నికల్లో ఏ స్థానాల్లో పోటీ చేస్తే జనసేనకు తిరుగుండదు అనే అంశాలపై చర్చించారని జనసేన వర్గాలు చెప్తున్నాయ్.

రాష్ట్రవ్యాప్తంగా ఏ స్థానాల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తుందనే అంశంపై కొన్ని సంస్థలతో సర్వే చేయించడంతో ఆయా సర్వే సంస్థల ప్రతినిధులతో.. పవన్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించి ఫలితాలపై చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. జనసేన గెలిచి అవకాశం ఉన్న నియోజకవర్గాలపై క్లారిటీ రావడంతో ఆ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్లు , ప్రస్తుతం సర్వే నివేదికలు అన్నిటిని కంపేర్‌ చేసి.. టీడీపీ దగ్గర సీట్ల కోసం ప్రతిపాదనను పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నారని టాక్‌. ఐతే ఈ నంబర్‌ 30కి అటు ఇటుగా ఉంటుందని తెలుస్తోంది. పొత్తు ప్రకటనకు ముందే.. అన్ని విషయాల్లో పక్కా క్లారిటీతో ముందుకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.