Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రాణహాని వ్యాఖ్యలు.. సానుభూతికోసమా.. నిజంగానే ముప్పుందా..?

శనివారం రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. తనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారని ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 10:18 AM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలుసిసలైన రాజకీయం మొదలెట్టినట్లే కనిపిస్తోంది. వారాహియాత్ర ద్వారా దూకుడు పెంచారు. అధికార వైసీపీపై పంచులతో విరుచుకుపడుతున్నారు. గతంలోకంటే భిన్నంగా పవన్ ప్రసంగం సాగుతోంది. తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. తనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే, నిజంగానే పవన్ చేసినట్లు ఆ‍యనకు ప్రాణహాని ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే సానుభూతి కోసం పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయవర్గాల్లో. పవన్ ఈ సారి గెలుపే లక్ష‌్యంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా కొన్ని విషయాల్లో ఆచితూచి మాట్లాడుతున్నారు. తనను సీఎం చేయాలంటూ కోరుతున్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు.

ఇతర హీరోల అభిమానులు కూడా ఆలోచించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో సీఎం పదవిపై తనకు ఆశలేదన్నారు పవన్. ఇటీవలి సమావేశాల్లో కూడా సీఎం పదవి గురించి పాకులాడటం లేదన్నారు. సీఎం పదవి కోరేంత మెజారిటీ తనకు లేకపోవచ్చన్నారు. కానీ, ఇప్పుడు మాట మార్చారు. తను సీఎం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రాణహాని అనే అంశాన్ని వాడుకుంటున్నారా అనిపిస్తోంది. గతంలొ కోడికత్తి ఘటన, వైఎస్ వివేకా హత్య ఘటన జగన్ గెలుపునకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పవన్ కూడా ఇదే తరహా స్ట్రాటజీ అమలుచేస్తున్నారా అనిపిస్తోంది.