Nadendla Manohar: జనసేనలో నెంబర్ 2గా గుర్తింపు తెచ్చుకున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తెనాలిలో నాదెండ్లను గెలిపించాలని కోరారు. తెనాలి నుంచి నాదెండ్ల పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటనే సందేహం కలుగుతోంది. పొత్తు విషయంలో టీడీపీతో ఏకాభిప్రాయం కుదరడంతోపాటు, తెనాలి విషయంలో స్పష్టత రావడం వల్లే పవన్ ఈ ప్రకటన చేశారా..? లేక టీడీపీకి ధీటుగా ప్రకటన చేశారా..? అనే డౌట్లు తలెత్తుతున్నాయి.
టీడీపీ-జనసేన దాదాపు కలిసే పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ఉన్న ప్రచారం. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీ కూడా కలిసే అవకాశాలున్నాయి. అయితే, ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ, కలిసి పోటీ చేసేందుకు టీడీపీ-జనసేన ఆసక్తి చూపిస్తున్నాయి. అదే జరిగితే సీట్లు పంచుకోవాలి. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తేలాలి. అప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉండాలి. కానీ, టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసింది. అటు జనసేన కూడా కొందరికి టిక్కెట్లు కన్ఫామ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ఎలా సాధ్యమో అంతుచిక్కడం లేదు. పొత్తు ఉందంటూనే.. రెండు పార్టీలూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి వాళ్లు కొన్నిచోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో నాదెండ్లను తెనాలి అభ్యర్థిగా ప్రకటించడం మరింత గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉంది.
టీడీపీ అభ్యర్థి సంగతేంటి..?
తెనాలి నుంచి టీడీపీ తరఫున కొన్నేళ్లుగా మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. అలాంటిది టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఎవరు కాంప్రమైజ్ అవుతారు అనేది సమస్య. జనసేనలో నెంబర్ 2గా ఉన్నాడు కాబట్టి.. నాదెండ్ల వెనుకడుగు వేసే అవకాశం లేదు. జనసేనకు సీటు కేటాయించక తప్పదు. టీడీపీయే సీటు వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీనో.. ఇంకో పదవో ఇస్తామని హామీ ఇస్తే పరిస్థితి అనుకూలంగా మారవచ్చు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే.. ఈ స్థానం దాదాపు జనసేనదే. లేదంటే సమస్యే లేదు. అయితే, పవన్ కళ్యాణ్.. ఏ నమ్మకంతో నాదెండ్లను అభ్యర్థిగా ప్రకటించారని చర్చ సాగుతోంది. రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందా..? సీట్ల విషయంలోనూ ఏకాభిప్రాయానికి వచ్చారా..? అందుకే పవన్.. నాదెండ్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పొత్తుల విషయం ఇంకా ఏటూ తేలడం లేదు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. టీడీపీ మాత్రం జనసేన ఉంటే చాలనుకుంటోంది. బీజేపీ కూడా తమతో జనసేన ఉంటే చాలు.. టీడీపీ అవసరం లేదు అనుకుంటోంది. దీంతో ప్రస్తుతం పొత్తుల అంశం మూడు ముక్కలాటగా మారింది. ఈ విషయంపై ఎప్పటికి స్పష్టత వస్తుందో..!