Pawan Kalyan: జగన్‌పై పవన్ విమర్శనాస్త్రాలు.. రిచెస్ట్ సీఎం అంటూ జనసేనాని విమర్శ..

తెగిపోయిన డ్యాంను ఏడాదిలోగా తిరిగి పూర్తిస్థాయిలో నిర్మిస్తామని అప్పట్లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికి 18 నెలలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదని.. అసలు పనులే సరిగ్గా ప్రారంభం కాలేదని పవన్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 02:25 PM IST

Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు సంధించారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం కాదా అని గుర్తు చేశారు. శుక్రవారం ఉదయం వరుస ట్వీట్లతో పవన్ విమర్శలు గుప్పించారు. 2021 నవంబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం మట్టికట్ట తెగిపోయింది. దీంతో డ్యాం పరిధిలోని అనేక గ్రామాలను వరద ముంచెత్తింది. డ్యాం సమీపంలోని తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏపీ ప్రభుత్వం స్పందించింది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో.. ఇలాంటి డ్యాంల నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో దేవుడికే ఎరుక అంటూ పవన్ విమర్శించారు. తెగిపోయిన డ్యాంను ఏడాదిలోగా తిరిగి పూర్తిస్థాయిలో నిర్మిస్తామని అప్పట్లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికి 18 నెలలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదని.. అసలు పనులే సరిగ్గా ప్రారంభం కాలేదని పవన్ విమర్శించారు. పైగా తన అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి, పనిని రూ.660 కోట్లకు అప్పజెప్పారని పవన్ ప్రస్తావించారు. అన్నమయ్య డ్యాం దుర్ఘటన ఏపీ ప్రభుత్వ వైఫల్యమే అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో చెప్పిన విషయాన్ని పవన్ తన ట్వీట్‌లో గుర్తు చేశారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగేది కాదని, హామీ ఇచ్చినట్లుగా అన్నమయ్య డ్యాం నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

దేశంలోనే అత్యంత సంపద (అధికారికంగా రూ.500 కోట్ల ఆస్తి) కలిగిన సీఎం జగన్ పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ విమర్శించింది. మరోవైపు ఏపీలో పేదలకు వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జనసేన విమర్శించింది. ఏపీ ఖజానాను ఖాళీ చేస్తున్న వైసీపీ దొంగల ముఠా ఇప్పుడు పేదలకు వైద్య సేవలు కూడా అందించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిందని విమర్శించింది. ఆరోగ్య శ్రీ విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. తక్షణమే రూ.368 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపైనే కాకుండా అంతకుముందు రాష్ట్రంలో ఇసుక దోపిడీపై జగన్‌ను పాపం పసివాడు పేరుతో పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు ట్వీట్లతో వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి నేరుగా రాజకీయ క్షేత్రంలోకి దిగితే ఇరు పార్టీల మధ్య వార్ ఎలా ఉంటుందో చూడాలి.