అందుకే అలా మాట్లాడా: పవన్, కూల్ అంతా సెట్ చేస్తా,పవన్ కు బాబు భరోసా

ఏపీలో అధికారుల తీరుపై గత కొన్నాళ్ళుగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 6, 2024 / 05:45 PM IST

ఏపీలో అధికారుల తీరుపై గత కొన్నాళ్ళుగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కొందరు అధికారులు… నేరాలను చేసే వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని, కావాలనే తమను వేధిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఎస్పీలు కూడా సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల పోలీసు వ్యవస్థపై లా అండ్ ఆర్డర్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన ఏకంగా హోం శాఖనే టార్గెట్ చేయడం చూసాం. ఈ నేపధ్యంలో… బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. అసలు తాను ఎందుకు అలా మాట్లాడా అనేది పవన్ కళ్యాణ్… సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం సిఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై, అధికారుల తీరుపై మంత్రులతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

జిల్లాల్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని చంద్రబాబుకు మంత్రులు వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారంపైనా మంత్రి వర్గంలో సుదీర్ఘ౦గా చర్చించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చ లేవనెత్తి… పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు చేసారు.

అదే విధంగా వైసీపీ ప్రభుత్వం లో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారని పవన్ చంద్రబాబుకు వివరించారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన ఇతర మంత్రులు… కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. ఓ కీలక విషయాన్ని, తమకు ఎదురు అవుతున్న అనుభవాన్ని చంద్రబాబుకు వివరించారు. పలు జిల్లాల ఎస్పీలు స్వయంగా మంత్రులు ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం లేదని… పైగా జరుగుతున్న తప్పులకు… కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న పవన్ కళ్యాణ్… నేను అందుకే కాకినాడలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చంద్రబాబుకు వివరించారు. అనంతరం జోక్యం చేసుకున్న చంద్రబాబు… గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థ ను గాడికి తెద్దామని సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు.

గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారని తెలిపారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని… కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తా అంటూ మంత్రులకు హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిద్దామన్న చంద్రబాబు సోషల్ మీడియా పోస్టుల పైనా ఇక ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు. మంత్రులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తన వద్దకు తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు.