Pawan Kalyan: షరతుల్లేవ్‌.. పొత్తుకు సై అన్న పపన్.. వైసీపీ ఓటమే లక్ష్యం!

రెండు పార్టీల మధ్య పొత్తు లేదంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్‌ చెప్పేశారు. జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం మొదలైన నేపథ్యంలో జనసేనాని కీలక ప్రకటన చేశారు. టీడీపీతో పొత్తు తప్పదని స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 06:34 PM IST

Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. షరతులు లేకుండానే సైకిల్‌ సవారీకి సై అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేదంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్‌ చెప్పేశారు. జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం మొదలైన నేపథ్యంలో జనసేనాని కీలక ప్రకటన చేశారు. టీడీపీతో పొత్తు తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న తన పాత మాటకు కంటిన్యూ చేస్తూనే ఈసారి దానికి మరికొన్ని అంశాలు జోడించారు.

ముఖ్యమంత్రి పదవి కావాలని షరతు పెట్టను అన్నారు పవన్. బలాన్ని బట్టే సీట్లు అడుగుతానన్నారు. బలం ఉన్నచోటే పోటీ చేస్తామన్నారు. ఈ మాటల ద్వారా సీఎం సీటు ఇస్తేనే పొత్తు కుదురుతుందని పవన్ షరతు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టారు. అంటే చంద్రబాబుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లే. అంతేకాకుండా బలాన్ని బట్టే పోటీ చేస్తామన్నారు. అంటే తాను ఎక్కువ సీట్లు అడగబోనని చెప్పకనే చెప్పినట్లైంది. రాయలసీమలో తమకు అంత బలం లేదని అలాంటి చోట ఎక్కువ సీట్లలో పోటీ చేయబోమన్నారు. దీన్నిబట్టి చూస్తే జనసేనకు 30-40సీట్లు ఇచ్చినా పవన్‌ ఓకే అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేన ఆశిస్తోంది. ఎక్కువ సీట్లు అడిగి పొత్తు పొసగక మరోసారి జగన్‌కు అవకాశం ఇవ్వకూడదన్నది పవన్ ఆలోచన.
టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తుకు కమలం పెద్దలు అంగీకరించడం లేదన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు పవన్. ఇంతవరకు ఢిల్లీ పెద్దలు దానిపై తనకు క్లారిటీ ఇవ్వలేదన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ తేల్చి చెప్పిందంటూ ఇంతకాలం జరుగుతున్న ప్రచారానికి పవన్ ఇప్పుడు చెక్ చెప్పారు. అవసరమైతే మరోసారి బీజేపీ పెద్దలను ఒప్పిస్తామని చెప్పడం ద్వారా చివరి వరకు ప్రయత్నిస్తామని పవన్ స్పష్టంగానే చెప్పారు. బీజేపీ కలిసి రాకపోయినా టీడీపీతో పవన్ కలిసి అడుగులేయడం ఖాయం. అయితే తన తప్పు లేకుండా బీజేపీ సహకరించలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ నో అంటే తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు.
పొత్తులపై పవన్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఏపీలో పొత్తులపై బీజేపీ పెద్దలు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు. రాష్ట్ర బీజేపీ నేతల మనోగతం తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు పవన్. పొత్తుల అంశాన్ని ఇక సాగదీయకూడదన్నది ఆయన ఆలోచన. నోటిఫికేషన్ వచ్చాకో, చివరి క్షణంలోనే పొత్తు పెట్టుకోవాలని పవన్ భావించట్లేదు. అలాంటప్పుడు కేడర్ కలవక ఇబ్బందులు ఎదురవుతాయని పవన్‌కు అర్ధమైంది. కాబట్టి ముందు నుంచే సిద్ధం కావాలని భావిస్తున్నారు. మరోసారి జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వకూడదన్నది జనసేనాని పట్టుదల. టీడీపీతో జనసేన కలవడం బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేయడం కూడా ఇష్టం లేదు. ఈ దూరాన్ని తగ్గించాలనే పవన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇటీవలే చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు పవన్. దాదాపు గంటన్నరసేపు మాట్లాడారు. జగన్‌ను ఓడించాలన్న లక్ష్యం ఒకటే. ఆ రోజు చంద్రబాబుకు చెప్పారో లేదో కానీ ఈ రోజు మాత్రం తనకు ఎలాంటి షరతులు లేవని చెప్పారు పపన్. దీంతో పొత్తులపై కీలక అడుగు ముందుకు పడినట్లైంది. ఇక బీజేపీ ఏం చేస్తుందన్నదే కీలకం. కలిసి వస్తే ఆ పార్టీకి నాలుగైదు సీట్లు ఇస్తారు. లేకపోతే అదీ లేదు. ఇప్పుడు పవన్ ప్రకటనతో ఇక రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై అంతర్గత చర్చలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.